ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఉండవల్లి తదితర గ్రామాలలో భూసేకరణను నిలిపివేస్తున్నట్లు మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ చేసిన ప్రకటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
“రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావుగారు, నారాయణగారు ఇతర మంత్రివర్ద్గా సభ్యులు అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు…
ముఖ్యంగా రైతుల మనోభావాలను సానిభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు..” అని ట్వీట్ చేసారు.
కానీ భూసేకరణను నిలిపివేస్తామని, రైతులు ఇస్తేనే భూములు తీసుకొంటామని మంత్రి నారాయణ చెపుతున్న మాటలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవు. రాజధాని ప్రాంతానికి మధ్యలో ఉన్న భూములు తీసుకోకుండా రాజధానిని త్రిశంఖు స్వర్గంలాగ గాలిలో నిర్మించడానికి తామేమీ విశ్వామిత్ర మహర్షులంకాము అని ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రి నారాయణ రైతులు ఇష్టపడి ఇస్తేనే భూములు తీసుకొంటామని చెపుతున్నారు. కానీ పెనుమాకలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన రైతులు తమ ప్రాణాలయినా ఇస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వబోమని తెగేసి చెప్పారు.
రైతులు భూములు ఇవ్వకపోతే అప్పుడు రాజధానిని ఎక్కడ కడతారు? ఎలాగ కడతారు? అని ప్రశ్నించుకొంటే రాజధాని నిర్మాణానికి రైతుల భూములు తీసుకోకతప్పదని అర్ధం అవుతోంది.
ఒకవేళ అక్కడి రైతుల భూములను విడిచిపెడితే, మిగిలిన గ్రామాల రైతులు తము తొందరపడి ప్రభుత్వానికి భూములు ఇచ్చినందుకు అన్యాయం జరిగిందనే భావన కలగడం సహజం. అప్పుడు వాళ్ళు కూడా పేచీ పెడితే పరిస్థితి ఏమిటి? ఒకవేళ పెనుమాక తదితర గ్రామాలలో భూములకు మార్కెట్ రేట్ల ప్రకారం ప్రభుత్వం ధర చెల్లించేందుకు సిద్దపడినా లేదా వారికి మిగిలిన రైతులకంటే అధనంగా ప్యాకేజీ ఇచ్చినా కూడా మిగిలిన గ్రామాల రైతులు తమకు దానిని వర్తింపజేయమని పట్టుబట్టవచ్చును. కనుక రైతులు తమంతట తాముగా ఇస్తేనే భూములు తీసుకొంటామని మంత్రి నారాయణ చెప్పడం, ఆయన మాటలను పవన్ కళ్యాణ్ నమ్మేసి పేరుపేరునా థాంక్స్ చెప్పుకోవడం రెండూ విచిత్రమే!