జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై జనసేన త్రిసభ్య కమిటీ.. నేరుగా రైల్వే కోడూరుకే వెళ్లి విచారించింది. ఆ కమిటీ ఎదుట అరవ శ్రీధర్ హాజరయ్యారు. ఈ వివాదంలో మొత్తం ఏం జరిగిందో ఆయన వివరించారు. తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించారు. విచారణ తర్వాత అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. పార్టీ ఏ నిర్మయం తీసుకుంటుందో తనకు తెలియదన్నారు.
కమిటీ విచారణలో శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. సదరు మహిళతో తనకు వ్యక్తిగత పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఆమె తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ, వైసీపీ నాయకులతో కలిసి రాజకీయ కుట్ర పన్నిందని ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఈ హనీట్రాప్ డ్రామా ఆడుతున్నారని, తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలు అన్నింటినీ కమిటీకి అందజేశానని ఆయన సన్నిహితులకు చెప్పారు.
కేవలం ఎమ్మెల్యే వివరణకే పరిమితం కాకుండా, త్రిసభ్య కమిటీ నియోజకవర్గంలోని జనసేన శ్రేణుల అభిప్రాయాలను కూడా సేకరించింది. దాదాపు 40 మంది ముఖ్య నేతలు, కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసింది. ఈ వ్యవహారం వల్ల పార్టీ ప్రతిష్టకు జరిగిన నష్టం, స్థానిక ప్రజల స్పందనపై కమిటీ ఆరా తీసింది. బాధితురాలిగా పేర్కొంటున్న మహిళ కూడా విచారణకు ముందే మరో వీడియో విడుదల చేస్తూ.. దీన్ని రాజకీయం చేయవద్దని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఫోన్ డేటాను పరిశీలించాలని కోరింది.
కమిటీ సేకరించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను నేరుగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేయనున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పవన్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా లేదా అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
