ప్రజల్లో ఇన్స్టెంట్గా కదలిక వచ్చేలా చేయడంలో మన పొలిటీషియన్స్ సిద్ధహస్తులు. వాళ్ళు ఆవేశపడేలా చేయడంలో, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో సినిమావాళ్ళకంటే పొలిటీషియన్స్ ఏ మాత్రం తీసిపోరు. ఓ వైపు కాపు రిజర్వేషన్స్ కోసం పోరాటం అంటున్న ముద్రగడ వారు ‘కాపు జాతి’ అన్న రొమాంటిక్, సెంటిమెంట్ పదాన్ని కాయిన్ చేశారు. ముద్రగడవారు టార్గెట్ చేసిన యువతకు ఆ పదం బాగానే ఎక్కేసింది. ఆంతరంగికంగా ఎలా ఉన్నా బహిరంగంగా కులం, కుల రిజర్వేషన్స్ అనే మాటలను వినిపిస్తే కొంతమంది ప్రజలు అయినా నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆయనగారు ‘కులం’ అనే వర్డ్‌ని ‘జాతి’ అనే పదంతో రిప్లేస్ చేశారు. ఆ పదానికి అర్థం లేదు కదా అని అడక్కండి. ఆ విషయం ముద్రగడకూ తెలుసు. కానీ ‘కాపు జాతి’ అనే సౌండింగ్‌కి ఉన్న పవర్ గురించి కూడా తెలుసు. అందుకే ‘కాపు జాతి’కి కమిట్ అయ్యారు. సక్సెస్ అయ్యారు కూడా.
ఇప్పుడిక నవతరం, యువతరం పొలిటిషియన్‌గా తనకు తానే ఓ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్న పవన్ కళ్యాణ్‌కి కూడా ఓ రొమాంటిక్, సూపర్ సౌండింగ్ ఉన్న పదం అవసరమైంది. అందుకే కొన్ని దశాబ్ధాల క్రితం నుంచీ కూడా క్రేజీ వర్డ్ అయిన ‘ఆత్మ గౌరవం’ అన్న పదం తీసుకొచ్చి, దానికి తెలంగాణా ఉద్యమ సమయంలో బాగా పాపులర్ అయిన సీమాంధ్ర అన్న పదాన్ని యాడ్ చేసి పడేశాడు. ఇప్పుడు ఆత్మగౌరవం పేరు చెప్పి పోరాడటంలో అర్థం లేదు. ఆ అవసరం కూడా లేదు. సీమాంధ్రుల ఆత్మగౌరవానికి ఇప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అదసలు సమస్యే కాదు.
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బిజెపి, నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడులు మాట తప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్‌కి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా వస్తుంది, బిజెపికి ఓటేయండి, నరేంద్రమోడీని ప్రధానిని చేయండి అని ఊరూవాడా తిరిగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు. చేవలేని, చేతకాని ముఖ్యమంత్రిగా మిగిలిపోయి సీమాంధ్రప్రజల సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఓటుకు కోట్లు కేసు ప్రభావమో, లేక అమరావతి భూముల వ్యవహారమో లేక వేరే ఏదైనా ప్రజలకు సంబంధం లేని విషయం ఉందో తెలియదు కానీ ప్రత్యేక హోదా వరకూ చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రజల తరపున నిలబడ లేదు అన్నది వాస్తవం. అలా చంద్రబాబు నాయుడు తనకు ఓటేసిన ప్రజలను మోసం చేశాడు. ఇక వెంకయ్యనాయుడి వంచన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యేక హోదా ఇష్యూ తర్వాత వెంకయ్య నాయుడిని నాయకుడిగా గుర్తించడానికి కూడా సీమాంధ్ర ప్రజలు ఇష్టపడడం లేదు.
పైన చెప్పుకున్న నాయకులందరికీ చివరి నిమిషంలో చిడతలు వాయిస్తూ ముందుకొచ్చిన పవన్ కూడా మాట తప్పిన మాట వాస్తవం. ఎన్నికలకు ముందు మోడీ, చంద్రబాబులు పనిచేయకపోయినా, తప్పులు చేసినా ఏదో చేసేస్తా అనే స్థాయిలో ఉత్తరకుమార ప్రగల్భాలు పలికాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలవగానే నేను ‘ఉత్త’ రాకుమారుడినే…నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపీలున్నారా? అని చేతకాని, చేవ చచ్చిన మాటలు మాట్లాడి పవన్ పైన ఆశలు పెట్టకున్న వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. ఇక టిడిపి అనుకూల మీడియా విన్యాసాలు అయితే వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. రైతు రుణమాఫీ, ప్రత్యేక హోదా, అద్భుత రాజధాని…ఇంకా టిడిపి, బిజెపిలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరిపోయాయి. ఆ అద్భుతాన్ని అతి త్వరలోనే తిలకించబోతున్నాం. మీరు చంద్రబాబు, మోడీలను గెలిపించడమే ఆలస్యం అని చెప్తూ ఎన్నికల సమయంలో పేజీలకు పేజీలు రాసిపడేశారు. గంటలు గంటలు ఆసక్తికరమైన గ్రాఫిక్స్‌తో సినిమాలే చూపించేశారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ నాయకుడిలాగే, నాయకుడికంటే కూడా ఎక్కువగా ప్రత్యేక హోదా వచ్చినా ఒరిగేదేమీ లేదు, రాకపోయినా జరిగే నష్టం కూడా లేదు అని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఎం.డి. రాధాకృష్ణ పడుతున్న పాట్లు అయితే సీమాంధ్ర ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. వీళ్ళందరికీ కామన్ ప్రత్యర్థి అయిన జగన్ మెడకు కేసుల గుదిబండ ఉన్నంత కాలం ఆయన నుంచి ఏమీ ఆశించడానికి లేదన్నది వాస్తవం. ఈ విషయంలో మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతిలు చెప్పింది నిజం.
కారణాలేవైనా అందరినీ ఆశ్ఛర్యానికి గురిచేస్తూ ప్రత్యేక హోదా పోరాట పగ్గాలు అందుకోవడానికి ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్‌గారు…ఇప్పుడు మాట్లాడాల్సింది సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం గురించి కాదు. వాళ్ళకు ద్రోహం చేసిన మోడీ, వెంకయ్యనాయుడు, మోసం చేసిన చంద్రబాబుల గురించి. కులం కారణంగా, సినిమాల ప్రభావంతో పవన్‌ని అభిమానిస్తున్న వాళ్ళను పక్కన పెడితే సీమాంద్ర ప్రజలందరూ కూడా పవన్ నుంచి ఆశిస్తున్నది ఇదే. సర్దార్ సినిమా కోసం జాతీయా మీడియాలో కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రచారం చేయించిన పవన్ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలి. వైఎస్ జగన్లాగా అప్పుడో సభ, ఇంకెప్పుడో ఓ నిరాహారదీక్ష పెట్టడం లాంటివి కాకుండా నిరంతరంగా పోరాడాలి. తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, తెలంగాణాలో అడుగు పెట్టాలనుకున్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి జై కొ్ట్టాల్సిన పరిస్థితులను కెసీఆర్ సృష్టించాడు. అదీ ఇప్పుడు కావాల్సింది. ప్రత్యేక హోదాతో పాటు, ప్రత్యేక ప్యాకేజ్, రైల్వే జోెన్లాంటి విషయాల్లో కూడబులక్కున్నట్టుగా ప్రజల ముందు నానారకాల విన్యాసాలు, నాటకాలు ప్రదర్శిస్తూ, వాళ్ళను మోసం చేస్తూ….. కలిసి కాపురం చేస్తున్న బిజెపి, టిడిపి నాయకులు మరోసారి సీమాంధ్ర ప్రజల ముందుకు రాలేని పరిస్థితులు క్రియేట్ అవ్వాలి. బిజెపి నేతలకు ఎక్కడికక్కడ అవమానాలు, నిలదీతలు ఎదురవ్వాలి. ఆ సెగ ఢిల్లీకి తాకాలి. మాట తప్పను, మడమ తిప్పను. పదవుల కోసం రాలేదు. నేను కొత్త రకం రాజకీయ నాయకుడిని అని పదే పదే డ్రమెటిక్ డైలాగ్స్ వినిపించాల్సిన అగత్యం మరోసారి పవన్ కళ్యాణ్‌కి రాకూడదు అనుకుంటే పోరాట పంథా ఇలా ఉండాలి. రాజకీయ నాయకుడిగా పది కాలాల పాటు ప్రజలకు సేవ చేద్ధామన్న కమిట్మెంట్తోనే రాజకీయాల్లోకి వచ్చా. ఎవ్వరికీ భయపడను అన్న పవన్ మాటలను ప్రజలు నమ్మాలంటే కూడా అధికారంలో ఉన్నవాడిని, బలవంతుడిని ఎదిరించే ధైర్యం, విమర్శించే సాహసం పవన్ చేయగలగాలి. అంతే కానీ సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం లాంటి పాత చింతకాయ పచ్చడి పదాలను మరోసారి కమ్మగా వినిపించడానికి అయితే మాత్రం మరో కొత్త రాజకీయ నాయకుడి అవసరం సీమాంధ్ర ప్రజలకు లేదేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గారూ….