జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను గుర్తు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యిని వినియోగించినట్లుగా సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ స్పష్టం చేసిన అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ న్యూస్ రిపోర్టును షేర్ చేసిన ఆయన .. మరో ట్వీట్ తన అభిప్రాయాలు వెల్లడించారు. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే.. తినుబండారం కాదన్నారు.
తిరుమలకు ఏటా రెండున్నర కోట్ల మంది వస్తారని.. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం తీర్థక్షేత్రం కాదు. ఇది పవిత్ర ఆధ్యాత్మిక ప్రయాణమని గుర్తు చేశారు. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం ఓ సామూహిక భావోద్వేగం – బంధువులు, కుటుంబ సభ్యులు, తెలియని వారితో కూడా పంచుకుంటామని గుర్తు చేశారు. సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే హిందూత్వాన్ని బలహీనపరిచేనట్లేనని స్పష్టం చేశారు. సెక్యులరిజం రెండు విధాలుగా ఉండాలని.. అందుకే ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ను దేశంలో అన్ని పక్షాల సమ్మతితో ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడినప్పుడు పవన్ కల్యాణ్ ఇదే డిమాండ్ ను సభలో ప్రటించారు. అప్పట్లో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి కల్తీ నెయ్యి అంశం లో ఆధారాలు బయటకు వస్తూండటంతో..అదే డిమాండ్ వినిపించారు. సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేసి..దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలన్నింటినీ ఆ బోర్డే చూసుకోవాలన్నది పవన్ కల్యాణ్ భావన.


