2026లోని బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఏదంటే ‘దురంధర్ 2’ పేరే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకూ దాదాపు రూ.1100 కోట్లు సాధించింది. ఈ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఫైనల్ రన్ అయ్యేసరికి ‘బాహుబలి’, ‘దంగల్’ రికార్డుల్ని బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘దురంధర్ 2’ రికార్డుల్ని దాటే శక్తి… ఈయేడాది వచ్చే చిత్రాల్లో ‘పెద్ది’ కే ఉందని సినీ పండితులు భావిస్తున్నారు. తెలుగులో ‘పెద్ది’ హవా మామూలుగా ఉండదు. హిట్ టాక్ వస్తే, బాక్సాఫీసు బద్దలే. తెలుగునాట కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. కాకపోతే.. నార్త్ లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్నది కీలకం.
‘పెద్ది’ ఓ స్పోర్ట్స్ డ్రామా. అందరికీ కనెక్ట్ అయ్యే కథే. కాబట్టి.. నార్త్ వాళ్లకూ ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా ‘ఆర్.ఆర్.ఆర్’ తో నార్త్ లో చరణ్ మార్కెట్ పెరిగింది. అక్కడ `పెద్ది`కి మంచి రిలీజ్ దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెహమాన్, జాన్వీ కపూర్.. ఈ పేర్లు నార్త్ లో వసూళ్లకు ఉపయోగపడొచ్చు. నిర్మాతల ముందున్న పెద్ద టాస్క్ ఏమిటంటే.. ‘పెద్ది’ ని పాన్ ఇండియా రేంజ్లో ప్రమోట్ చేయడం. అందుకు ‘పుష్ప’ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి. ‘పుష్ప’ టైమ్లో నార్త్ లో గట్టిగా ఫోకస్ చేశారు. తెలుగులో కంటే అక్కడే ప్రచారం ఎక్కువ చేశారు. ‘పుష్ప 2’ రికార్డు వసూళ్లు చేయడానికి ఈ ప్రచారం బాగా దోహదం చేసింది. ‘గేమ్ ఛేంజర్’ కి ఈ తరహా ఫోకస్ లేదు. దానికి తగ్గట్టే వసూళ్లు వచ్చాయి. ఈసారి మాత్రం ప్రచారం విషయంలో చరణ్ గేరు మార్చాలి. ‘దురంధర్ 2’ ని దాటాలంటే నార్త్ లో ఈ సినిమా ఆడాలి. కేవలం సౌత్ వసూళ్లతోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టడం కల్ల.
కానీ చిత్రబృందం దగ్గర అంత టైమ్ ఉంటుందో లేదో? ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవ్వాలి. ఏప్రిల్ 15 వరకూ షూటింగ్ బాకీ వుంది. ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ గొడవలూ ఉంటాయి. మరి ప్రచారానికి ఛాన్సెక్కడ? చరణ్, జాన్వీ ఉంటే తప్ప నార్త్ లో ప్రచారం ఊపందుకోదు. వాళ్లతో వీలైనన్ని ఈవెంట్లు చేస్తే.. ‘పెద్ది’ కి పబ్లిసిటీ దొరుకుతుంది. ఆ దిశగా నిర్మాతలు ఆలోచించాలి.


