ఏపీలో స్థానిక సంస్థల ఉపఎన్నికల్ని నిర్వహిస్తున్న ఎస్ఈసీ నీలం సహానిపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పోలింగ్ బూతులను ఓటర్లకు దూరంగా కదిలిస్తున్నారు. పోలీసులు టీడీపీకి వంతపాడుతున్నారని.. పేర్ని నాని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. బయట మీడియాతో మాట్లాడుతూ.. గోడకు చెప్పిన ఒక్కటే ఈసీకి చెప్పిన ఒక్కటే అనిపిస్తోంది. ఈసీ,కలెక్టర్,పోలీసులందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ఆరోపించారు.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సహాని ఉన్నారు. ఆమెను ఏరికోరి జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో నియమించారు. గతంలో చీఫ్ సెక్రటరీగా జగన్ ప్రభుత్వంలో పని చేశారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. పలుమార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కొన్నారు. ఆమె రిటైరైన తర్వాత జగన్ ఏరికోరి ఆమెకు.. ఎస్ఈసీ పదవిని అప్పగించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేది ఎస్ఈసీనే కాబట్టి ఈ పదవిని ఆమెకు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆమె తాము చెప్పినట్లుగా ఆదేశాలు జారీ చేయడం లేదని …ఆమెపైనే ఆరోపణలు చేస్తున్నారు.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు..ఢిల్లీలో ఈసీకి ఉన్నంత అధికారం ఉంటుంది. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఈసీదే ఫైనల్. ఎన్నికలు జరుగుతున్న చోట పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఎస్ఈసీదే. అయితే పేర్ని నాని తమపై దాడులు జరిగాయని ఫేక్ స్టోరీలు చెబుతూంటే నమ్మేసి.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. తమ ప్రభుత్వంలో చెప్పినట్లుగా పని చేసిన నీలం సహానిపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.