మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవలి కాలంలో తన వ్యక్తిగత జీవితం, తన తండ్రి దివంగత పేర్ని కృష్ణమూర్తి గురించి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులపై విరుచుకుపడే నాని, ఇప్పుడు తన కుటుంబం , ముఖ్యంగా తన తండ్రి పట్ల ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా వెల్లడించడం వెనుక ఉన్న ఫ్రస్ట్రేషన్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
బహిర్గతమైన చేదు నిజాలు
పేర్ని నాని తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి మాజీ మంత్రి. ఆయన తన తల్లి బతికి ఉండగానే తండ్రి మరో మహిళ విక్టోరియా వివాహం చేసుకున్నారని పేర్ని నాని చెబుతున్నారు. ఆ సమయంలో తన తల్లి పడిన వేదన నానిని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పుకుంటున్నారు. సమాజంలో తన తండ్రికి ఒక గౌరవం ఉన్నప్పటికీ, ఒక కొడుకుగా తన ఇంటిలో చూసిన పరిస్థితులు ఆయనను ఆవేదనకు గురిచేశాయి. చనిపోయిన తర్వాత కూడా తండ్రిని కించపరుస్తున్నారనే విమర్శలు వస్తున్నప్పటికీ, నేను చూసిన నిజం ఇది అనే పట్టుదలతో ఆయన ఈ విషయాలను బయటపెడుతున్నారు.
రాజకీయ వారసత్వం – అనివార్యమైన బంధం
నిజానికి పేర్ని నాని రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని మోయడం ఇష్టం లేకపోయినప్పటికీ, తన కుమారుడు పేర్ని కిట్టు కోసం ఆయన మళ్లీ రాజకీయాల్లో కొనసాగాల్సి వస్తోంది. తన తండ్రి పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా రాజకీయాలకు దూరం కావాలనుకున్న నాని, ఇప్పుడు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ అదే బురదలోకి దిగాల్సి రావడం ఆయనలో తీవ్ర అసహనాన్ని పెంచుతోంది. నాకు ఇష్టం లేకపోయినా నా దరిద్రం కొద్దీ మళ్లీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అని ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు.
అధికారం లేని నిస్సహాయత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత పేర్ని నానిలో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు తన కుమారుడు పేర్ని కిట్టుపై వరుసగా పోలీసు కేసులు నమోదు కావడం, మరోవైపు నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం ఆయన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఇటీవల మచిలీపట్నంలో అధికారులతో గొడవ పడటం, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసుల్లో ఇరుక్కోవడం ఆయన మానసిక స్థితిని సూచిస్తున్నాయి.
చనిపోయిన తండ్రిపై ఇప్పుడెందుకు పగ?
ఒక రాజకీయ నాయకుడు తన తండ్రిని చనిపోయిన తర్వాత ఇలా కించపరిచేలా మాట్లాడటం అరుదు. ఇది ఆయన వ్యక్తిత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. తండ్రి ఇమేజ్ను వాడుకుని రాజకీయాల్లో ఎదిగిన నాని, ఇప్పుడు అదే తండ్రిని విమర్శించడం ద్వారా తన అస్థిత్వాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ, ఇవన్నీ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అధికారం పోయిన తర్వాత ఎదురవుతున్న అవమానాలు, కేసుల ఒత్తిడిలో పేర్ని నాని తన నియంత్రణ కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
