ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన బినామీల పేర్ల మీద పెట్టుకున్న వైసీపీ నేతలు, జగన్ రెడ్డి దోపిడీకి సహకరించి తాము కూడా తలాపాపం పిండుకున్న వారి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. విశాఖ శివారులో ఇలా భూముల్ని వందల ఎకరాలను కొంత మంది వైసీపీ నేతలు, అప్పటి ఐఏఎస్ అధికారులు బినామీల పేర్ల మీద కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని భూములను పారిశ్రమిక అవసరాల కోసం తీసుకుంటోంది. అందుకే బినామీలు విలవిల్లాడుతున్నారు. కోర్టుల్లో తప్పుడు పిటిషన్లు వేస్తున్నారు.
గూగుల్ కోసం తర్లువాడ అనే గ్రామంలో భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి రైతులు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీకి సంతోషంగా భూములు ఇస్తున్నారు. అనూహ్యంగా ఈ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయింది. అధికారులు ఆశ్చర్యపోయి ఆయా రైతులను సంప్రదిస్తే తమకు తెలియదని చెబుతున్నారు. పిటిషన్ వేసినట్లుగా చెబుతున్న వారిలో ఓ చనిపోయిన రైతు పేరు కూడా ఉంది. దాంతో అసలు విషయం అర్థమైపోయింది.
వైసీపీ అధికారలో ఉన్నప్పుడు కీలక స్థానంలో పని చేసిన ఐఏఎస్ ఒకరు అక్కడ డీపట్టా భూములు కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. కానీ పూర్తిగా డబ్బులు చెల్లించలేదు. ఆయనకు మధ్యవర్తిగా ఉన్నవారితో రైతులను బెదిరించి ఈ పిటిషన్ల కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఐఏఎస్ చెల్లిస్తామన్నదానికన్నా మూడు రెట్లు ఎక్కువగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ బినామీ ఐఏఎస్ సంగతి తేల్చాలని ఆదేశించారు. ఆయన నిర్వాకాలన్నీ వచ్చే రోజుల్లో బయటకు రానున్నాయి. రాష్ట్రానికి వచ్చే ప్రతిష్టాత్మక సంస్థలకు అడ్డం పడేందుకు.. వైసీపీ బినామీలు దేనికైనా తెగిస్తున్నారు. వారి సంగతి చూడకపోతే ముందు ముందు రెచ్చిపోతారని.. అణిచివేయాని డిసైడ్ అయ్యారు.