తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి జారీ చేసిన రిజర్వేషన్ల జీవోపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ఓ పిటిషన్ దాఖలు అయింది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతోందని.. యాభై శాతానికన్నా ఎక్కువగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో ఇచ్చారని.. ఆ జీవో ఆధారంగానే స్థానిక ఎన్నికలషెడ్యూల్ ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. రిజర్వేషన్ల జీవో పెంపు చెల్లదని ప్రకటించాలని కోరారు.
ఈ పిటిషన్ పై విచారణ సోమవారం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ ఓ సారి జరిగింది. కానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేందుకు వాయిదా వేసింది. ఎనిమిదో తేదీన విచారణ చేపట్టనున్నారు. అంతకంటే ముందే సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అంటే తెలంగాణ హైకోర్టు కంటే ముందే సుప్రీంకోర్టు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జీవో న్యాయపరంగా అయితే చెల్లుబాటు కాదన్న వాదన అన్ని పార్టీల్లోనూ ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఉత్తర్వులు గతంలోనే ఇచ్చింది. ఇలాంటి జీవోలను ఇతర రాష్ట్రాలు ఇస్తే కొట్టేసింది. అందుకే ఈ జీవో ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని ఎక్కువ మంది నమ్మడం లేదు. తొలి విడతగా నామినేషన్లు తొమ్మిదో తేదీ నుంచి స్వీకరించేలా నోటిఫికేషన్ రానుంది. ఈ లోపే న్యాయపరంగా ఏదో ఒకటి తేలనుంది.