ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్కు వణుకు పుట్టిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాడూబొంగరం లేని బొగ్గు స్కాం పేరుతో ఆరోపణలు చేసి..అందుకే డైవర్షన్ కోసమే విచారణకు పిలుస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పెద్దల్లో అంతర్గతంగా ఓ భయం ప్రారంభమయిందని హరీష్ రావు ప్రెస్‌మీట్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఏడున్నర గంటల పాటు జరిగిన విచారణలో హరీష్ రావు ఏం చెప్పారో కానీ.. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల్ని ప్రశ్నించాలని డిమాండ్ చేయడం అంటే.. తాము ఇరుక్కుపోతామని వారు నిజాలు చెప్పరని అనుకుంటున్నారని లెక్క. కానీ జరుగుతోంది వేరు.
సజ్జనార్ పక్కా ప్లానర్
ట్యాపింగ్ కేసులో పెద్దలున్నందున మామూలు అధికారులు విచారణ చేయలేరని ప్రభుత్వం సజ్జనార్ నేతృత్వంలో సిట్ ను నియమించింది. పెద్దల జాతకాలు బయటపెట్టే బాధ్యతను ప్రభుత్వం అప్పగించడంతో సజ్జనార్ కేసును సీరియస్ గానే తీసుకున్నారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. విచారణలో తనదైన ముద్ర వేసే సజ్జనార్, ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. హరీష్ రావు వంటి అగ్రనేతను ఏడున్నర గంటల పాటు విచారించడం, ఆ తర్వాత హరీష్ రావు గొంతులో కనిపించిన తడబాటు.. కేసు తీవ్రతను స్పష్టం చేస్తోంది. కేవలం అధికారులపైనే కాకుండా, వారికి ఆదేశాలు ఇచ్చిన రాజకీయ శక్తులపై సజ్జనార్ గురిపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.
పోలీస్ బాస్‌ల వ్యూహం
ప్రస్తుత పోలీస్ ఉన్నతాధికారుల వ్యవహారం కూడా బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారింది. గతంలో ఓటుకు నోటు కేసు సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, నాటి డీజీపీ మహేందర్ రెడ్డిలకు గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు అంత సాఫీగా లేవనేది బహిరంగ రహస్యం. మహేందర్ రెడ్డి సమాచారంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిన సాంకేతిక ఆధారాలను, నాటి పరిస్థితులతో జోడించి విచారణను వేగవంతం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా డేటా డిలీట్ చేసినా, విదేశాల నుంచి తెప్పించిన హార్డ్ డిస్క్‌ల గుట్టు రట్టు చేయడంలో వీరు సజ్జనార్‌కు కీలక సమాచారం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కవిత ఆరోపణలు కూడా కీలకమే !
ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. బీఆర్ఎస్ కుటుంబ సభ్యురాలు కవిత స్వయంగా ట్యాపింగ్‌పై ఆరోపణలు చేయడం. తనపై కూడా నిఘా ఉంచారనే కోణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఆయుధంగా మారాయి. కల్వకుంట్ల కుటుంబంలోనే ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి రావడంతో, ట్యాపింగ్ జరిగిందనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. ఇది విచారణాధికారులకు రాజకీయంగా కాకుండా, నైతికంగా కూడా కలిసొచ్చే అంశం. అందుకే ఆమెకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆధారాలు సేకరిస్తే సంచలనాత్మక కేసు
ప్రస్తుతం సిట్ సేకరించిన సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు బీఆర్ఎస్ అగ్రనేతలకు సమస్యగా మారుతున్నాయి. నిఘా పరికరాల కొనుగోలు నుంచి, ప్రైవేట్ వ్యక్తుల సంభాషణల రికార్డింగ్ వరకు అన్నింటికీ సంబంధించిన చిట్టా సజ్జనార్ దగ్గర సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకే, బయట ఎంత గంభీరంగా మాట్లాడినా, లోలోపల మాత్రం తమపై ఎప్పుడు చర్యలు ఉంటాయోనన్న భయం బీఆర్ఎస్ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు ఉండే అవకాశం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. డైవర్షన్ పేరుతో ఎంత రాజకీయం చేసినా స్పీడ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు.
