తెలంగాణలో మూలకు పడిపోయిందని అనుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసుల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకువచ్చేందుకు భారత్ పంపిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రభాకర్ రావును ఇండియాకు తరలించేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ బృందం కసరత్తు ప్రారంభించినట్లు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. ఆయనను రాజకీయ శరణార్థిగా ప్రకటించకుండా ఉండేలా…తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో వాటన్నింటిని నివేదిక రూపంలో అమెరికా ప్రభుత్వానికి అధికారులు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుతో ముడిపడి ఉండటంతో ఆయన అమెరికా నుంచి వస్తేనే ఈ కేసు ముందుకు కదులుతుంది. తాము ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా చేశామని, విచారణలో మిగతా నిందితులు వెల్లడించినట్లు చార్జీషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఆయన ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆదేశాలను ఇచ్చారు? అనేది బయటపెడితే కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అందుకే ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే విషయంలో తెలంగాణ సర్కార్ పట్టుదలగా ఉంది. దీంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావడం, ఆయన అక్రమాల నివేదిక అక్కడి అధికారులకు పంపడంతో ఆయనను ఏ క్షణంలోనా ఇండియాకు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ప్రభాకర్ రావు అమెరికాలోనే సెటిల్ అవుదామని అనుకున్నా ఆ ఛాన్స్ మరికొన్నాళ్ళు లభించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అరవై ఏళ్లు దాటినా వారిని ట్రంప్ సర్కార్ వారి దేశాలకు పంపిస్తోంది. ఇలా చూసినా ఆయన వీలైనంత తొందరగా భారత్ రావడం ఖాయమని అంటున్నారు.