గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంలో పైలట్ రోహిత్ రెడ్డి కీలకపాత్ర పోషించాడని.. ఆయన కూడా రేపోమాపో బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడని గత మూడు, నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండించకపోతే అంతా నిజం అనుకుంటారనో.. తాత్కాలికంగా అయినా ఖండించకపోతే ఇబ్బంది పడతామని అనుకున్నారో కానీ ఓ ఖండన ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో పార్టీ మార్పు గురించి ప్రచారం జరుగుతోందని అదంతా ఉత్తదేనన్నారు.
ఫామ్ హౌస్లో తమను కొనేందుకు వచ్చిన వారిని తానే స్వయంగా పట్టించానని తాను బీజేపీలో ఎందుకు చేరుతానని చెప్పారు. అంటే.. తనను ఎందుకు బీజేపీలోకి తీసుకుంటారన్న అర్థంలో ఆయన చెప్పడం ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో తాను కేసీఆర్, కేటీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానంటున్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే మేలు చేస్తుందని స్పష్టం చేశారు.
ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గతంలో వారు బీజేపీతో మాట్లాడుకున్న సమయంలోనే ట్యాపింగ్ ద్వారా కనిపెట్టి.. వాళ్లతో రివర్స్ గేమ్ ఆడించారన్న అనుమానాలున్నాయి. ట్యాపింగ్ కేసులో జరుగుతున్న దర్యాప్తులోనూ ఇదే తేలిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ బీజేపీలో వారు చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అప్పుడేం జరిగిందో కానీ.., పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరికపై పుకార్లు ప్రారంభమయ్యాయి. ఆయన ఖండించినా నమ్మేవారు తక్కువగా ఉన్నారు.