మొయినాబాద్ పరిధిలో డ్రగ్స్ పార్టీ జరిగిన ఫాంహౌస్‌ను రెవెన్యూ , పోలీసు అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. కేవలం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందన్న ఆరోపణలే కాకుండా, ఆ ఫాంహౌస్ నిర్మించిన స్థలం నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన అసైన్డ్ భూమి అని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేదలకు కేటాయించిన భూమిని అక్రమంగా కొనుగోలు చేసి, అక్కడ విలాసవంతమైన కట్టడాలు నిర్మించడంపై రెవెన్యూ యంత్రాంగం సీరియస్ అయింది.
ఈ కేసులో సిట్ అధికారులు తమ విచారణను మరింత వేగవంతం చేశారు. విచారణలో భాగంగా కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు తొలుత డ్రగ్స్‌ను సిమ్లా నుండి తెచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, సిట్ దర్యాప్తులో అవి స్థానికంగానే సేకరించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఫాంహౌస్‌లోని సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
రోహిత్ రెడ్డిపై గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్ని కూడా పోలీసులు బయటకు తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆర్థిక వ్యవహారాలు, బినామీ పనులు అన్నింటినీ బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో రోహిత్ రెడ్డికి ఉన్న ఆర్థిక బంధాలను కూడా ఎక్స్ పోజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.


