మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి సంచలనాత్మకంగా మారింది. ఖచ్చితమైన సమాచారం రావడంతో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోహిత్ రెడ్డికి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను అడ్డుకునే క్రమంలో మూడు రౌండ్ల కాల్పులు జరపడం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారా లేదా అధికారులను లక్ష్యంగా చేసుకున్నారా అనే కోణంలో విచారణ జరుగుతోంది.
పట్టుబడ్డ కీలక నేతలు.. ప్రముఖులు
ఈ దాడుల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబడినట్లు సమాచారం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో పాటు రాజస్థాన్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఈ పార్టీలో ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు నల్లపనేని విజయకృష్ణ, శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి వంటి వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగంపై వీరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సాక్ష్యాల ధ్వంసం – పీఏ తీరు
సోదాలు మొదలవ్వగానే రోహిత్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తన ఫోన్‌ను నేలకేసి కొట్టి పగలగొట్టడం అనుమానాలకు తావిస్తోంది. కీలకమైన సమాచారం బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే అతను ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు పీఏ గతంలో కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడిన రికార్డు ఉండటంతో, ఈ పార్టీ నెట్వర్క్ వెనుక అతని పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తదుపరి విచారణ.. రాజకీయ దుమారం
ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలం నుండి కీలక సాక్ష్యాధారాలను, సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరినీ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ పై రైడ్, అది కూడా కాల్పుల ఘటనతో తోడవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన తర్వాత వెలువడే అవకాశం ఉంది.
చాలా కాలంగా పైలట్ రోహిత్ రెడ్డిపై డ్రగ్స్ ఆరోపణలు
డ్రగ్స్ పార్టీల నిర్వహణలో పైలట్ రోహిత్ రెడ్డి రాటుదేలిపోయారని గతంలోనే ప్రచారం జరిగింది. బెంగళూరులోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అక్కడి పోలీసులు విచారణకు కూడా పిలిచారు. అయితే ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో స్పష్టత లేదు. ఆయన డ్రగ్స్ పార్టీలపై హై సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని తెలిసినా.. హైదరాబాద్ లోనే ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడం ఆయన తెగింపునకు నిదర్శనం అనుకోవచ్చు.
