తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటన సందర్భంగా అక్కడి ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని రాజేశాయి. రేవంత్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చుతూ కేరళ సీఎం పినరయి విజయన్ నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. రాజకీయ విభేదాల కోసం వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఆయన హితవు పలికారు.
విజయన్ కు మోదీ సపోర్టు ఉందని రేవంత్ ఆరోపణలు
కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కేరళ అభివృద్ధి సూచీల్లో నంబర్ వన్‌గా ఉండటానికి కారణం గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. కేరళ సాధించిన నీతి ఆయోగ్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల ర్యాంకును పినరయి విజయన్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్ , ఊమెన్ చాందీ హయాంలో జరిగిన అభివృద్ధి వల్లే కేరళ నేడు అగ్రస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి వాదించారు. పినరయి విజయన్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీపై పోరాడటంలో విఫలమైందని, కేరళలో పారిశ్రామిక స్తబ్దత నెలకొందని ఆరోపించారు. విజయన్ను మోదీ కాపాడుతున్నరని అన్నారు.
పినరయి విజయన్ ఇచ్చిన సుదీర్ఘ వివరణ
రేవంత్ విమర్శలకు కేరళ సీఎం నొచ్చుకున్నారు. చారిత్రక విషయాలతో సుదీర్ఘంగా లేఖ రాశారు. కేరళలో భూసంస్కరణలు, వికేంద్రీకరణ పాలనను ప్రవేశపెట్టింది కమ్యూనిస్ట్ ప్రభుత్వాలేనని విజయన్ గుర్తు చేశారు. 1980ల్లో అక్షరాస్యత ఉద్యమాన్ని నడిపింది ఎల్డిఎఫ్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం కేరళ దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రమని, అలాగే అభివృద్ధిలో 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ 6వ స్థానంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఆర్ద్రం మిషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ రెజువనేషన్ మిషన్ ద్వారా 45,000 హైటెక్ క్లాస్‌రూమ్‌లను నిర్మించినట్లు తెలిపారు. కేరళను దేశంలోనే మొదటి పేదరిక నిర్మూలన రాష్ట్రంగా మార్చామని పేర్కొన్నారు. కేరళ పారిశ్రామికంగా వెనుకబడిందన్న రేవంత్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. 20,000 డీప్-టెక్ స్టార్టప్‌లు, విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ వంటి ప్రాజెక్టులతో కేరళ పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. తాము బీజేపీతో కుమ్మక్కు కాలేదని, కేంద్రం అప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆర్టికల్ 131 కింద పోరాడుతున్నామని విజయన్ స్పష్టం చేశారు.
రేవంత్ భాషపై విజయన్ అభ్యంతరం
రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం అని విజయన్ పేర్కొన్నారు. కేరళ అనుసరిస్తున్న నవ కేరళ నమూనా అందరికీ ఆదర్శమని పినరయి విజయన్ తన లేఖలో ధీమా వ్యక్తం చేశారు. కేరళ ప్రజల అనుభవం రేవంత్ రెడ్డి చిత్రించిన దానికి భిన్నంగా ఉందని, కేరళ ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటుందని ఆయన లేఖలో చెప్పారు.
