టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు వారాల్లో సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. గడువు చివరి రోజు అయిన గురువారం ఇద్దరూ కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా వారు బలప్రదర్శన చేయాలనుకున్నారు. కానీ చేయలేకపోయారు.
గుండ్లపాడు వద్ద ఇద్దరు టీడీపీ నేతల్ని కొంత మంది దుండగులు హత్యచేశారు. వారు అంతకు ముందు కొద్ది రోజుల కిందట టీడీపీలో చేరారు. వారిని వ్యూహాత్మకంగా టీడీపీలో చేర్పించి హత్యలు చేసేలా ప్రోత్సహించి.. టీడీపీ అంతర్గత రాజకీయాల వల్లనే హత్యలు చేసుకున్నారన్న కలరింగ్ ఇచ్చేందుకు పిన్నెల్లి బ్రదర్స్ ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులతో తరచూ వారు సమావేశమైన ఆధారాలు సేకరించారు. పోలీసులు మొదట్లో ఇది ఆధిపత్య పోరాటమే అనుకున్నారు. కానీ తర్వాత దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తమపై తప్పుడు కేసులు పెట్టారని పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులకు వెళ్లారు. పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. ప్రతి కోర్టులోనూ నేరం చేశారన్నదానికి ఆధారాలు చూపిస్తూ వచ్చారు. సుప్రీంకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ మరింత తెలివిగా వ్యవహరించారు. కేసు డైరీని, సాక్ష్యాల స్టేట్మెంట్లను సమర్పించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది .. సరెండర్ కావాలని ఆదేశించింది. ఇప్పుడు వారు సాధారణ బెయిల్ దాఖలు చేసుకోవాల్సిన ఉంది. కానీ పోలీసులను ప్రభావితం చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ముందు వారే సాక్ష్యాలు సమర్పించడంతో వారికి బెయిల్ రావడం కూడా కష్టమేనని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
