ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతర హింస దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువగా హింస జరుగుతుంది. అది రెండు, మూడు రోజుల్లో సద్దుమణిగిపోతుంది. కానీ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రైవేటు సైన్యాలతో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. వారికి పోలీసులు సహకరించారు. తాడిపత్రిలో రాజంపేట డీఎస్పీ వచ్చి టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. ఇంత ఘోరంగా పరిస్థితులు ఎందుకు దిగజారిపాయాయి.. తెర వెనుక ఏం జరుగుతుందన్నదానిపై మాత్రం.. ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేదని చెప్పేందుకు ఈసీని బద్నాం చేసేందుకు వైసీపీ కుట్ర సిద్ధాంత నిపుణులు ఈ హింసను ప్రరేపించారన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. దీని వెనుక పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు. మూడు రోజుల హింస తర్వాత వైసీపీ నేతలు తమ వాదన వినిపించడం ప్రారంభించారు. కీలకమైన సమయాల్లో అధికారుల్ని బదిలీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ దెబ్బతిన్నదని వాదించడం ప్రారంభించారు. డీజీపీని మార్చడం వల్లే సమస్యలు వచ్చాయని లేకపోతే అంతా ప్రశాంతంగా జరిగిపోయేదని అంటున్నారు. అంటే ప్రశాంతంగా తాము చేయాలనుకున్నది చేసే వాళ్లమని సజ్జల అభిప్రాయం కావొచ్చు.
ఇప్పుడు వైసీపీ మెల్లగా ఈసీపై నిందలేయడం ప్రారంభించింది. ఈ రోజు నుంచి మరింత ఉద్ధృతంగా ఈసీపై బురద చల్లవచ్చు. ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేదన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. తమ ఓటమికి ఈసీనే కారణమని… ప్రజలు కాదని చెప్పేందుకు ప్లాన్డ్ గా వ్యవహరిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈసీ తమ పవర్ చూపించేందుకు సిద్ధమవుతోంది. కీలకమైన అధికారులపై ముఖ్యంగా హింస చెలరేగిన చోట్ల అధికారులపై వేటు వేసే అవకాశం ఉంది.