పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ దాని నిర్మాణానికి మాత్రం కేంద్రం ఏమాత్రం మనస్ఫూర్తిగా సహకారం అందించడం లేదని, ఈ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీ ప్రజలను వంచిస్తున్నదని ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా జనంలో నిరసనజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సాక్షాత్తూ కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమా భారతి పోలవరం ప్రాజెక్టు గురించి శనివారం నాడు చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం కొత్త ఆశలు ఊపిరి పోస్తున్నాయి. ఉమాభారతి శనివారం నాడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణం అవుతుందని వ్యాఖ్యానించడం విశేషం.
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా కేంద్రంనుంచి విడతలుగా ఇస్తున్న నిధులు తనకు ఏమాత్రం సంతృప్తి కలిగించలేదని ఉమాభారతి స్వయంగా ప్రకటించారు. అదే సమయంలో.. కొత్తగా పోలవరం ప్రాజెక్టుకు 1600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా తాను నీతిఆయోగ్‌కు లేఖ రాసినట్లు కూడా ఆమె వెల్లడించారు. దేశానికే ప్రతిష్ఠాత్మకమైన ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం గురించి.. తాను త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్లు ఉమాభారతి తెలియజేశారు.
ఏదో సందర్భం వచ్చినప్పుడు.. పోలవరానికి నిధులు ఇస్తున్నాం అంటూ ఆపద్ధర్మంగా కంటితుడుపు డైలాగులు వల్లించడం వేరు. నిజానికి వెంకయ్యనాయుడు సహా మోడీ సర్కారులోని అరుణ్‌జైట్లీ తదితర నాయకులంతా చేస్తున్న పని అదే. అయితే వీరిలో ఉమాభారతి కాస్త ప్రాక్టికల్‌గా పోలవరం ప్రాజెక్టు వాస్తవ ప్రాధాన్యాన్ని గుర్తించినట్లుగా మాట్లాడుతుండడం గమనిస్తే.. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆమె ఏదో జనాంతికంగా నిధులు ఇచ్చేస్తాం మేం చూసుకుంటాం.. తరహా డైలాగులు వేయడం లేదు. ఎంత మొత్తం తక్షణం ఇవ్వదలచుకుంటున్నామో.. నిర్దిష్టంగా చెప్పారు. 1600 కోట్ల విడుదలకు నీతిఆయోగ్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కాబోతున్నట్లు కూడా చెప్పారు.
ఇప్పటికే కేంద్రం విదిలిస్తున్న ముష్టి నిధుల పట్ల ఏపీ సర్కారు తీవ్ర ఆగ్రహంతో రగులుతోంది. తాజాగా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వలన ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివేదిస్తూ, నిధుల తక్షణ విడుదల ఆవశ్యకతను తెలియజెబుతూ మోడీకి లేఖ రాయడానికి చంద్రబాబు ఉద్యుక్తుడవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం నీటిపారుదల మంత్రి ఉమాభారతి ఇంత ఉదారంగా పోలవరం గురించి స్పందించడం ఆశాజనకం. ఆమె చెబుతున్నట్లుగా 1600 కోట్ల విడుదల అనేది వాస్తవరూపం దాలిస్తే గనుక.. పోలవరం ప్రాజెక్టుకు అది వరమే అని చెప్పకతప్పదు.