పోలీసు వ్యవస్థలో ఉండే దొంగలతోనే ఆ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిపోతోంది. రాజకీయ నేతలతో కుమ్మక్కు సంగతి పక్కన పెడితే.. దోపిడీలు, దొంగతనాలకు వారు సాయం చేస్తూ.. అందులో వాటాలు కూడా తీసుకుంటున్న వారు ఉండటమే అసలు విషాదం. దొరికిన వారు దొరుకుతున్నారు. దందాలు చేసేవారు చేస్తున్నారు. చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐ వ్యవహారం ఐదుగురు యువకుల ప్రాణాలు పోయిన తర్వాత బయటపడింది. కానీ ఇంకెంత మంది వ్యవస్థలో ఇలాంటి చీడపురుగులు ఉన్నారో అంచనా వేయడం కష్టం.
దోపిడీ ముఠాతో జట్టుకట్టిన చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐ
చిలుకలూరిపేట హైవేపై ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటెయినర్ ను కారు ఢీకొనడంతో ఐదుగురు విద్యార్థులు చనిపోయారు. కంటెయినర్ హఠాత్తుగా ఆగడంతో.. వేగాన్ని నియంత్రించలేక కారు వచ్చి ఢీకొన్నది. ఆ కంటెయిన్ హఠాత్తుగా ఎందుకు ఆగిందంటే.. ఓ కారు వచ్చి లారీకి అడ్డంగా ఆగింది. పోలీసులు ఆ సీన్ ఫుటేజీ చూసి ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అందులో ఉన్నది ఫేక్ పోలీసులు. బ్రేక్ ఇన్స్ పెక్టర్ల పేరిట లారీలను దోపీడీ చేస్తున్నారు. ఆ ముఠా నాయకుడు ఓ పోలీసు అధికారి కుమారుడు. వీరికి చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐ మద్దతిస్తారు. వారి దోపిడీ సొమ్ములో వాటా తీసుకుంటాడు. ఆ విషయం తెలిసి సస్పెండ్ చేశారు.
ఆయన దొరికాడు..దొరకని వాళ్లు ఎంత మందో ?
చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐ దొరికాడు కానీ దొరకని ఇలాంటి దొంగ పోలీసులు ఎంతో మంది ఉంటారు. రాజకీయ నేతలతో కుమ్మక్కు అయి చేసే రాజకీయ వేధింపులు ఓ రకం.. కానీ ఇలా దోపిడీలు, దొంగతనాల ముఠాలతో కుమ్మక్కు కావడం అంటే.. వ్యవస్థను చెదలు పట్టినట్లుగా పట్టి తినడమే అవుతుంది. ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. ఎంత మంది అంటే.. సగం మందికిపైగా పోలీసులు ఇలాగే ఉన్నారని.. నేరస్తులతో సంబంధాలు పెట్టుకుని వారి వ్యవహారాలకు మద్దతుగా ఉండేవారు..కావాల్సిన సమాచారం ఇచ్చేవారు కూడా ఉన్నామన్న ఆరోపణలు బలంగానే ఉన్నాయి.
ప్రజలకు భరోసా ఇచ్చేలా పోలీస్ వ్యవస్థను మార్చాలి !
ప్రజలకు భరోసా పోలీసు వ్యవస్థ. వీరిలో నేరస్తులకు కొమ్ముకాసేవారు పెరిగిపోతే ప్రజలకు భరోసా పోతుంది. కనీసం శాంతిభద్రతలు, నేరగాళ్ల విషయంలో అయినా పోలీస్ డ్రెస్సు కు విలువ ఇవ్వని వారిని కనిపెట్టి బయటకు పంపేయాలి. నేరాలు చేసే వారితో కలిసి నేరాలు చేయడం.. దానికి పోలీసు డ్రెస్సు ఉపయోగించడం క్షమించరాని రాని నేరం. వ్యవస్థను కాపాడాలంటే.. ముందు ఇలాంటి నేరస్తుల్ని ఏరి వేయాలి. అందు కోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. పోలీసు వ్యవస్థ ఉన్న ది నేరగాళ్లతో కలిసి నేరాలు చేయడానికి కాదని నమ్మకం కలిగించాలి.


