జైలు నుంచి కోర్టుకు హాజరు పరిచే క్రమంలో చెవిరెడ్డి వేసే డ్రామాలు ఓ రేంజ్ లో ఉంటాయి. జైలు గేటు బయట అడుగు పెట్టింది మొదలు.. వాహనం దగ్గరకు వెళ్లే వరకూ ఆయన చాలా డైలాగులు చెబుతారు. ఆయన అలా చెబుతారని ముందే తెలుసన్నట్లుగా కొన్ని మీడియా చానళ్లు కూడా రెడీగా ఉంటాయి. ఇది పదే పదే జరుగుతోంది. ఆయన వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. తీసుకెళ్తున్న పోలీసులపై విమర్శలకు కారణం అవుతోంది. దీంతో పోలీసులు … ఏసీబీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
చెవిరెడ్డి వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయని ఆయనను వర్చువల్ గా కోర్టులో హాజరు పరుస్తామని పిటిషన్ వేశారు. దీంతో చెవిరెడ్డి లాయర్లు కంగారుపడిపోయారు. ఎలాగైనా .. జైలు నుంచి కోర్టులో ప్రత్యక్షంగా హాజరు పరిచేలా చూడాలని.. కొత్త వాదనలు వినిపించారు. ఆయన కొత్త సమస్యలు సృష్టించరని.. హంగామా చేయరని కావాలంటే అండర్ టేకింగ్ ఇస్తామని కోర్టుకు చెప్పారు.
చెవిరెడ్డి ఇప్పటికే చేయని డ్రామాలు లేవు. అనారోగ్యం పేరుతో ఆయన బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటగా తిరుపతి స్విమ్స్ లో మాత్రమే చికిత్స అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇప్పుడు వెన్నునొప్పి ఎక్కువగా ఉందని.. ప్రకృతి చికిత్స తీసుకుంటానని చెబుతున్నారు. అంటే ప్రకృతి చికిత్స పేరుతో ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా గడవచ్చని ప్లాన్ అన్నమాట.
చెవిరెడ్డి అరెస్టు అయినప్పటి నుండి చిల్లర వేషాలు వేస్తూనే ఉన్నారు. దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారు. హంగామా చేస్తున్నారు. అన్నింటినీ అధికారులు కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశపెడుతున్నారు.