1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనలు భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు. హిందీ ఒక్కటే అధికార భాషగా అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమిళనాడులో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. హిందీని బలవంతంగా అమలు చేస్తే తమిళ భాష, సంస్కృతి పక్కకు నెట్టబడతాయనే భయంతో అక్కడ ప్రజలు ఆందోళనలు దిగారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. సమ్మెలు, బహిరంగ సభలు, రైళ్ల నిలుపుదల, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఇంగ్లీష్‌ను కూడా అధికార భాషగా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.
ఈ రాజకీయ చరిత్ర ఆధారంగా నేషనల్ అవార్డ్ ఫిల్మ్ మేకర్ సుధా కొంగర తీసిన సినిమా పరాశక్తి. శివకార్తికేయన్ హీరోగా జనవరి పదిన ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అంతమాత్రంగానే వున్నాయి. పూర్తిగా తమిళ టచ్ వున్న సినిమా కావడంతో తెలుగు రిలీజ్ పై అంత ఆసక్తి లేదు. ఇప్పుడీ సినిమా పొలిటికల్ చిక్కుల్లో పడింది.
ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చరిత్రను వక్రీకరించారని, ఇందిరాగాంధీ సహా కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని, శివకార్తికేయన్ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు అన్నీ దర్శకురాలు ఊహించుకొని చిత్రీకరించిందని, చరిత్రలో జరగని సంఘటనలతో దీన్ని రూపొందించారని ఆరోపించారు.
విశేషం ఏమిటంటే ఈ సినిమాపై వచ్చిన రివ్యూలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీని, నాయకులని అంత బ్యాడ్ లైట్ లో చూపించడం అసహజంగా వుందని, ఇందులో చాలా సన్నివేశాల్లో ఒరిజినాలిటీకి దగ్గరగా లేవని పెదవి విరిచారు.
నిజానికి సుధా కొంగర ఒరిజినల్ వాయిస్ వున్న ఫిల్మ్ మేకర్. ఆమె నుంచి ఒక సినిమా వచ్చిందంటే కంటెంట్ మీద నమ్మకం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నప్పుడు ఆమె మరింత లోతైన పరిశోధన చేసి ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం ఇలాంటి రాజకీయ చిక్కుల్లో పడటం గమనార్హం.
