దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన గీతం డీమ్డ్ యూనివర్సిటీ చుట్టూ కొత్తగా మళ్లీ భూవివాదం రేపుతున్నారు. జీవీఎంసీ అప్పనంగా భూములు కట్టబెడుతోందంటూ వాస్తవాల కంటే రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే ఎక్కువగా చేస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా విశాఖ తీరంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ సంస్థ, అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూముల్లోనే తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కేవలం సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని, ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై కబ్జా ముద్ర వేసి ఇబ్బందిపెట్టారు. ఇప్పుడు ఆ సాంకేతికపరమైన సమస్యలు అధిగమించేందుకు సొమ్ము చెల్లించేందుకు సిద్ధపడితే అదీ తప్పే అంటున్నారు.
ప్రభుత్వం కేటాయించిన భూములే !
వివాదాస్పదమని చిత్రీకరిస్తున్న భూముల్లో గీతం సంస్థ ఎటువంటి శాశ్వత కట్టడాలు నిర్మించలేదు. ఆ స్థలాలను విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం క్రీడా మైదానాలుగా , ఇతర విద్యా సంబంధిత అవసరాలకేవాడుతున్నారు. 40 ఏళ్ల క్రితం కేటాయింపులు జరిగినప్పుడు ఉన్న రెవెన్యూ రికార్డులకు, ప్రస్తుత డిజిటల్ రికార్డులకు మధ్య ఉన్న చిన్నపాటి వ్యత్యాసాలను భూ ఆక్రమణలుగా చిత్రీకరించడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థ యాజమాన్యం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతోనే, ఈ అంశాన్ని వివాదాస్పదం చేసి బురద చల్లే ప్రయత్నం జరుగుతోందనేది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం.
సాంకేతిక అంశాలతో కబ్జా ముద్ర
నిజానికి, గీతం యాజమాన్యం చట్టానికి విరుద్ధంగా వ్యవహరించాలని ఎప్పుడూ భావించలేదు. ఒకవేళ సాంకేతిక పరంగా ప్రభుత్వ రికార్డుల్లో ఏవైనా తేడాలు ఉంటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి ఆ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి సంస్థ ఎప్పుడో సుముఖత వ్యక్తం చేసింది. నిబంధనల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, గతంలో కక్షపూరితంగా ప్రహరీ గోడలు కూల్చడం వంటి చర్యలు విద్యాసంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా సాగాయి. ఇప్పుడు జీవీఎంసీ ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమయింది. క్రమబద్దీకరించేందుకు సిద్ధమయింది. అయినా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు .
విశాఖకు మణిహారం గీతం
జాతీయ స్థాయిలో NAAC A++ గ్రేడ్ పొంది, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఇలాంటి సంస్థలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ వైరుధ్యాల వల్ల విద్యాసంస్థలను ఇబ్బందులకు గురిచేయడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, విద్యార్థులపై కూడా మానసిక ప్రభావం పడుతుంది. ప్రస్తుత ప్రభుత్వం చట్ట పరిధిలో ఈ భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించడం, ఒక దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, విద్యా రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ సంస్థ ఆ భూముల్ని కాలేజీ అవసరాలకు కాకుండా రియల్ ఎస్టేట్‌కు వాడితే వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎలాగూ ఉంటుంది.
