వికారాబాద్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీని శివుడితో’, బీజేపీని విష్ణుమూర్తితో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విష్ణుమూర్తి ఆడంబరంగా ఉంటారని కూడా ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో విష్ణుమూర్తిని పూర్తిగా వ్యతిరేక అర్థంలోనే పోల్చారు. తమ పార్టీని శివుడితో పోల్చుకున్నారు. రాహుల్ గాంధీ .. యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు కావు ఇవి.. శైవులు, వైష్ణవుల మధ్యచీలిక తెచ్చి ఓ వర్గాన్ని తన పార్టీకి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్న ప్లాన్.
కాంగ్రెస్ డీఎన్ఏలో అభయముద్ర ఉందట!
కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో శివుడికి ఉన్న అభయ ముద్ర ఉందని, బీజేపీ మాత్రం విష్ణుమూర్తి పేరుతో హింసాత్మక రాజకీయాలు చేస్తోందని రాహుల్ అంటున్నారు. గత కొంతకాలంగా రాహుల్ గాంధీ తనను తాను శివ భక్తుడి గా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని రాజకీయ విశ్లేషకులు సాఫ్ట్ హిందూత్వ గా అభివర్ణిస్తున్నారు. లోక్సభలో శివుడి చిత్రాన్ని ప్రదర్శించడం నుండి నిన్న వికారాబాద్లో చేసిన వ్యాఖ్యల వరకు, ఆయన శైవ సంప్రదాయాన్ని కాంగ్రెస్ వైపునకు తిప్పుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
హిందువుల్లో చీలక తెచ్చే ప్లాన్
హిందూ ధర్మంలోని శాఖల మధ్య ఉన్న సున్నితమైన వైవిధ్యాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల, భవిష్యత్తులో శైవ-వైష్ణవ విభేదాలు మళ్లీ రాజుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే చినజీయర్ స్వామి వంటి ఆధ్యాత్మిక గురువుల వ్యాఖ్యలు వివాదాస్పదమైన తరుణంలో, రాహుల్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నాయి. భారతదేశం వంటి లౌకిక దేశంలో దేవుళ్లను పార్టీలకు ప్రతినిధులుగా మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. శివుడు ఏ ఒక్క పార్టీకి సొంతం కాదు, అలాగే విష్ణువు కూడా ఏ ఒక్క రాజకీయ సిద్ధాంతానికి పరిమితం కాదు.
విభజన రాజకీయాలు చేస్తే తప్ప గెలవలేరా?
ప్రజల సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన వేదికలపై ఇలా మతపరమైన చిహ్నాలను వాడుకోవడం ఓట్ల వేటలో భాగంగానే కనిపిస్తుంది. రాజకీయ నాయకులు తమను తాము దేవుళ్ల వారసులుగా లేదా ఆయా దేవుళ్ల ప్రతినిధులుగా చిత్రించుకోవడం వల్ల సామాన్య ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన కంటే రాజకీయ ద్వేషం పెరిగే అవకాశం ఉంది. వికారాబాద్ ప్రసంగంలో రాహుల్ గాంధీ భయం గురించి మాట్లాడుతూ శివుడిని ప్రస్తావించారు. కానీ, ఇలాంటి పోలికలు హిందూ సమాజంలో అంతర్గత విభజనలను ప్రేరేపిస్తే, అది దేశ ఐక్యతకు భంగం కలిగిస్తుంది. రాజకీయ పోరాటాలు సిద్ధాంతాల మీద, ప్రజా సమస్యల మీద జరగాలి తప్ప, నా దేవుడు-నీ దేవుడు అనే స్థాయికి దిగజారకూడదు. కానీ వరుస ఓటములతో రాహుల్ గాంధీకి ఇంత కన్నా గొప్ప దారి కనిపించడం లేదని అనుకోవాలి.
