భారత రాష్ట్ర సమితిలో అంతర్గత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఫ్యామిలీలో ముఖ్యుల మధ్య అభిప్రాయ బేధాలు చాలా ఎక్కువయ్యాయని అవి ఏ క్షణమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. పార్టీకి పిల్లర్లుగా ఉన్న వారిలో ఒకరు బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుంటారని అంటున్నారు. అందులో నిజం ఎంత ఉందో కానీ.. అసంతృప్తి మాత్రం నిజం అని బీఆర్ఎస్లో ఓ స్థాయి నేతలకు చాలా స్పష్టత ఉంది. అది ఎటు వైపు మలుపులు తిరుగుతుందా అని ఆలోచిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ పిల్లర్స్ మధ్య కనిపించని పగుళ్లు
భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ మూల పురుషుడు. అయితే పార్టీని నడిపే పిల్లర్స్ గా కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉన్నారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రాక ముందు హరీష్ రావు నెంబర్ టు. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా రాజకీయ వ్యూహాలు అమలు చేసి పార్టీని ఓ రేంజ్ కు తీసుకెళ్లడంలో ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక.. హరీష్ పాత్ర తీసుకున్నారు. పదేళ్ల పాటు చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా పార్టీలో ఆయనదే హవా. అలాగే కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాగృతి ద్వారా అందర్నీ ఏకం చేశారు.
మామ గీసే గీత దాటనని ఎప్పుడో ప్రకటించిన హరీష్ రావు
అయితే ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో ఈ ముగ్గురూ మూడు దారుల్లో వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకరి అభిప్రాయాలతో మరొకరికి పొసగడం లేదని..తమకు ప్రాధాన్యత లేదని ఎవరికి వారు అసంతృప్తికి గురవుతున్నారని అంటున్నారు. హరీష్ రావు .. తన మామ గీత గీసిన గీతను దాటనని.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదే మాట మీద ఉంటానని చెబుతున్నారు. ఆయనను ఉమ్మడి మెదక్ కే పరిమితం చేసినా.. లైట్ తీసుకున్నారు. గతంలో ఈటలతో పాటు ఆయననూ దూరం పెట్టినా .. అవమానాలు ఎదుర్కొన్నా చిన్న మాట కూడా తూలలేదు. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉంటారని.. అసంతృప్తికి గురయ్యే అవకాశం లేదు.
జాగృతి పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత
ఇటీవలి కాలంలో కవిత ఎక్కువగా పార్టీ వ్యవహారాల కన్నా జాగృతి పేరు మీదనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ తరపున కార్కక్రమాలు నిర్వహించే విషయంలో సరైన స్పందన లేకపోవడంతో కవిత.. జాగృతి పేరుతో బీసీ ఉద్యమం, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అంతిమంగా.. పార్టీ కోసమే అన్నట్లుగా ఆమె చెబుతున్నారు. ఇటీవల ఆమెకు పార్టీలో మరింత ప్రాధాన్యం తగ్గించారని.. ఎల్కతుర్తి సభ విషయంలో అసలు పట్టించుకోలేదని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఫ్యామిలీలో వివాదాలు పెరిగిపోయాయని..పగుళ్లు పూడ్చలేనంతగా వచ్చాయన్న ప్రచారం ఊపందుకుంది. ఇవి నిజమే అయితే సంచలనాత్మక రాజకీయ పరిణామాలకు కారణం అయ్యే అవకాశం ఉంది.