సంక్షేమమా..? మార్పు కోణమా..? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎజెండా ఏమిటి..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పే పరిస్థితి లేదు. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు జగన్… ఇంకో వైపు పవన్ కల్యాణ్… తమ వంతుగా సిన్సియర్‌గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎవరికీ అనుకూల పరిస్థితి లేదు. నిజానికి ప్రతి ఎన్నికలోనూ.. ఓ అంశం హైలెట్ అవుతూ వస్తోంది. 1983 నుంచి… ఏదో ఒక అంశం ప్రజలను బాగా ప్రభావితం చేస్తూనే వస్తోంది. ఈ సారి ఎన్నికల్ోల ఆ “బర్నింగ్ ఇష్యూ” ఏమిటన్నది రాజకీయ పార్టీలకు అంతు బట్టడం లేదు.

ప్రతీ ఎన్నికలోనూ ఓ “తురుపుముక్క” లాంటి ఇష్యూ..!

ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. రాజకీయాలు మారిపోయాయి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉండేది కాదు. కానీ.. 1983లో టీడీపీ ఆవిర్భావంతో .. రాజకీయాలు మారిపోయాయి. అప్పటి నుంచే.. రాజకీయాలు భావోద్వేగ స్థాయికి చేరుకున్నాయని అంచనా వేయవచ్చు. “ఆత్మగౌరవ” నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఆ నినాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత 1985లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంతో… మరోసారి.. అదే తరహా ఉద్వేగం పెల్లుబీకింది. మధ్యంతర ఎన్నికలలో… ఎన్టీఆర్ అఖండ విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ…ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏమిటన్న విషయంపై అప్పటి రాజకీయ పార్టీలకు క్లారిటీ ఉంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక అంశం ఆధారంగా ఓటింగ్ జరుగుతూ వస్తోంది. 1989 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతి, ముఖ్యమంత్రుల్ని పదే పదే మార్చేయడం, 1999 ఎన్నికల్లో చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ నినాదం, 2004లో వైఎస్ కు ఒక్క చాన్స్‌ ఇద్దామనే ఆలోచన… మొత్తంగా ఫలితాలను నిర్దేశించాయి. 2009లో వైఎస్ రాజశేఖర్ పాలనపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అందుకే వైఎస్.. వ్యూహాత్మకంగా వ్యవహరించి… ప్రజలకు నేరుగా లబ్ది కలిగే పధకాలను పెద్ద ఎత్తున ప్రవేశ పెట్టారు. సంక్షే్మం పేరుతో… ఇలా నేరుగా ఓటర్లకు నగదు ప్రయోజనం కల్పించడం అప్పటి నుంచే ప్రారంభమయింది. ఈ కారణంగా రెండో సారి వైఎస్ నిలబెట్టుకోగలిగారు. ఇక 2014లో.. రాష్ట్ర విభజన అంశమే హాట్ టాపిక్ అయింది. అదే ఫలితాలను ఏకపక్షంగా మార్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికల “ఎజెండా” ఏమిటి..?

ఆంధ్రప్రదేశ్‌లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఏపీకి సంబంధించినంత వరకూ… పార్లమెంట్ ఎన్నికలను పట్టించుకునేది తక్కువ. అందరి దృష్టి… ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే..! ఏ పార్టీకి ఓటు వేస్తారనే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. దేశంలో మోడీ చౌకీదార్ అంటూ హడావుడి చేస్తున్నా.. రాహుల్ గాంధీ.. చౌకీదార్ చోర్ హై అంటూ కౌంటర్ ఇస్తున్నా… పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. అదే సమయంలో.. ఏపీలో .. ఈ సారి ఎన్నికల ఎజెండా ఏమిటి..? ప్రజలు ఏ అంశంపై ఓట్లు వేయబోతున్నారన్న దానిపైనా… ఎవరికీ స్పష్టత లేదు. ఉండటానికి ప్రజల ముందు చాలా ఇష్యూలు ఉన్నాయి. ప్రత్యేకహోదా, టీఆర్ఎస్‌తో వైసీపీ కుమ్మక్కు, ఆంధ్రుల ఆత్మగౌరవం, మోడీ నమ్మించి మోసం చేయడం, అభివృద్ధి ఆగకూడదనే నినాదం ఉన్నాయి. చివరికి ఇప్పుడు సంక్షేమ మంత్రం కూడా అండర్ కరెంట్‌గా ఉందని అంటున్నారు. వీటన్నింటిలో ఏది ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపించబోతోంది…?

1983 పరిస్థితులా…? 2009 తరహా ఎన్నికలా..?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఎజెండా నిర్ణయించడానికి టీడీపీ అధినేత చాలా కాలం క్రితం నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ప్రత్యేకహోదాను.. ఎజెండాగా మార్చాలని…. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. నాలుగేళ్ల కిందటే నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత ఆయన ఆ విషయంపై నోరెత్తలేని పరిస్థితికి చేరుకున్నారు. దాన్నే టీడీపీ అధినేత అందుకున్నారు. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వలేదని.. దానికి జగన్‌ కుమ్మక్కే కారణం అని.. ప్రజల్లోకి తీసుకెళ్లి.. బీజేపీని విలన్‌గా చేసి. ఎన్నికల ఎజెండాను డిసైడ్ చేయాలనుకున్నారు. కొంత కాలం అలాగే సాగింది. కానీ తెలంగాణకు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ముందుకు రావడంతో పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ సెంటిమెంట్ రాజేయడం…. చంద్రబాబును.. తెంలంగాణపై దండయాత్రకు వచ్చినట్లుగా కేసీఆర్ ప్రచారం చేయడంతో.. ఏపీలోనూ సెంటిమెంట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్‌కు అత్యంత ఆత్మీయుడిగా మారిపోవడంతో.. చంద్రబాబు దీన్ని మరింతగా ఉపయోగించుకుంటున్నారు. కేసీఆర్‌కు తనకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణిస్తున్నారు. తెలంగాణ వైపు నుంచి కవ్వింపు చర్యలు ఉండటంతో.. ఈ సెంటిమెంట్ ప్రజల్లో పెరిగిపోతోందన్న అభిప్రాయం ఉంది. జగన్ గెలిస్తే.. కప్పం కట్టాల్సి వస్తుందన్న చంద్రబాబు ప్రచారం ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తుందనేది.. ఈ అంశం ఎన్నికల ఎజెండాగా మారుస్తారనేది కీలకం. అది సెంటిమెంట్‌గా ప్రజల్లోకి వెళ్తే… 1985 తరహా ఫలితాలు బయటకు వస్తాయి..!

సంక్షేమ మంత్రం ఫలిస్తుందా..?

సహజంగా చంద్రబాబు అంటే సంస్కరణాభిలాషి. ప్రజలకు ఉచితంగా పెట్టడం కన్నా… కష్టపడి సంపాదించుకునేలా… వ్యవస్థను రూపొందించాలని కోరుకునే వ్యక్తి. కానీ.. రాజకీయాల్లో నెట్టుకు రావాలంటే… ప్రజలను సొంత కాళ్లపై నిలబడేలా కష్టపెడితే… సాధ్యం కాదని.. త్వరగానే గుర్తించారు. అందుకే.. ఈ సారి సంక్షేమ మంత్రం పఠించారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికి.. నాలుగేళ్ల కాలంలో రూ. లక్ష కోట్లు వెచ్చించారు. రుణమాఫీ దీనికి అదనం. చివరిలో… పెన్షన్లు, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ… నేరుగా… ఓటర్లకు నగదు బదిలీ పథకాలు పెట్టారు. ఇవన్నీ… లబ్దిదారుల్లో చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు చేసిన వ్యూహాత్మక అడుగు ఏమిటంటే.. ఒక్క సారి ఓటర్లు ఈ లబ్ది కలగదు.. ఓటు వేసే వరకూ.. ప్రతి నెలా పదో తేదీ లోపు.. ఈ లబ్ది అందుతోంది. ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ జరుగుతుంది. కానీ ఏప్రిల్ ఒకటి నుంచి పదో తేదీ లోపు… పెన్షనర్లు, డ్వాక్రామహిళలు, రైతులు .. ఇలా అందరి అకౌంట్లలోనూ సంక్షేమ నిధులు జమ కాబోతున్నాయి. ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని.. టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. పెన్షన్లు తీసుకునే వృద్ధులు.. కులమతాల గురించి ఆలోచించలేరు. తమకు మేలు చేస్తున్న వారి గురించే ఆలోచిస్తారంటున్నారు. అదే నిజమైతే.. 2009 తరహా ఫలితాలు వెల్లడి కావొచ్చు.

ఒక్క చాన్స్ అంటున్న జగన్ విజ్ఞప్తికి స్పందిస్తారా..?

ఈ విషయాలపై ప్రజల్లో క్లారిటీ ఉందో లేదో కానీ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగా ఉంది. అందుకే ఆయన… ” ఒక్క చాన్స్ ప్లీజ్ ” అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లున్నారు… తనకో అవకాశం ఇవ్వమంటున్నారు.. మరి జగన్ విజ్ఞప్తిని ప్రజలు అంగీకరిస్తే.. 2004 ఫలితాలు రావొచ్చు. ఏదైనా ఓటర్లు ఏ ఎజెండాను ఎంపిక చేసుకుంటారనేదే కీలకం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close