జూబ్లిహిల్స్ లో రాజకీయం సర్వేల దశకు చేరుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటున్న పార్టీలు.. బ్యాక్ గ్రౌండ్లో మా గాలి ఉందంటే.. మా గాలి ఉందని ప్రచారం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఊరూపేరూ లేని సర్వేలను సోషల్మీడియాలో ప్రకటించేసుకుని మాదే గెలుపు అని చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుంటే.. గెలుపు తమదేనని అనుకునే పరిస్థితిలో పార్టీలు ఉన్నాయి. సర్వేలు చేయకపోయినా చేసినట్లుగా చెప్పుకుని విజయం మాదే అని కాన్ఫిడెంట్ గా.. పర్సంటేజీలతో సహా చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ ప్రకటించుకునే సర్వేల్లో బీఆర్ఎస్ కు మూడో స్థానం.. బీఆర్ఎస్ ప్రకటించుకునే సర్వేల్లో కాంగ్రెస్కు మూడో, నాలుగో స్థానం వస్తున్నాయి. నమ్మరేమో అని అనుకునే కొన్ని హ్యాండిళ్లలో మాత్రం కాస్త పోటీ ఉంటోంది కానీ విజయం తమదేనని చెప్పుకుంటున్నారు.
ఈ రెండు పార్టీల ఆశను.. అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు కొంత మంది సోకాల్డ్ జర్నలిస్ట్ స్ట్రాటజిస్టులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. డబ్బులు వసూలు చేసి ఫేక్ సర్వేలు రిలీజ్ చేస్తున్నారు. అన్నీ తెలిసినా రాజకీయ నేతలకు ఏదో ఒకటి తమకు అనుకూలంగా ప్రచారం జరుగుతోంది కదా అని సంతృప్తి పడుతున్నారు. ఈ సర్వేలను వారి పార్టీల కార్యకర్తలు కూడా నమ్మలేకపోతున్నారు.