2009 ఎన్నికలకు ముందు వరకూ ఎన్టీఆర్‌కి, రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. నందమూరి కుటుంబ సభ్యులతో కూడా ఎన్టీఆర్‌కి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు. కానీ ఎన్నికలను ఎదర్కొనే సమయం వచ్చేసరికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను, అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవడం చంద్రబాబు స్టైల్. ఒక్క ఓటు కూడా మిస్సవ్వకూడదన్న లక్ష్యంతో ప్లాన్ చేసుకుంటాడు చంద్రబాబు. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు అనుభవాన్ని ఎవ్వరూ తక్కువ చేసి చూడలేరు. ఓ వైపు అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మరోవైపు కొత్తగా ప్రజారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తోడుగా యువరాజ్యం అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి. కెసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ దాని ప్రభావం తెలంగాణకే పరిమితం. టిఆర్ఎస్తో పొత్తు సీమాంధ్రలో నష్టం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఎన్టీఆర్ అనే స్టార్ అస్త్రాన్ని ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. ప్రచారం వరకూ చూసుకుంటే మాత్రం ఆ ఎన్టీఆర్ అస్త్రం టార్గెట్‌ని అద్భుతంగా రీచ్ అయినట్టే. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల కంటే కూడా…ఇంకా ఆ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించిన చాలా మంది కంటే ఎన్టీఆర్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు.
ఆ ప్రతిభే ఎన్టీఆర్‌కి నష్టం కూడా చేసింది. నందమూరి తారక రామారావు కొడుకుల్లో చాలా మంది పెద్దాయనకు హ్యాండ్ ఇచ్చి బావ పంచన చేరారు. కానీ మనవళ్ళకు మాత్రం మళ్ళీ తెలుగుదేశం పార్టీని నందమూరి వారి చేతుల్లోకి తీసుకురావాలన్న ఆశలున్నాయి. ఎన్టీఆర్‌కి ఆ ఆశ ఇంకాస్త ఎక్కువ. అందుకే చంద్రబాబును తక్కువ అంచనా వేసి… కాస్త ఎక్కువ దూకుడు చూపించాడు. లోకేష్ భవిష్యత్ కోసం టిడిపికి ఎన్టీఆర్‌ని దూరం చేయక తప్పదు అని చంద్రబాబు ఆలోచించుకునేలా చేశాడు. టిడిపికి, అనుకూల మీడియాకు, వర్గానికి దూరమవ్వాల్సిన పరిస్థితులను తెచ్చుకున్నాడు తారక్. ఎన్టీఆర్‌కి జగన్‌కి సంబంధాలున్నాయని, లోపాయికారిగా జగన్ పార్టీకి ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నాడని చాలా చాలా అబద్ధాలు ప్రచారం చేశారు కానీ అవన్నీ అసత్యాలే. నంబర్ ఒన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న, ఓ అగ్రశ్రేణి పొలిటికల్ జర్నలిస్టుతో వెళ్ళి ఓ సారి ఎన్టీఆర్‌ని కలిసినప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయడం జరిగింది. తాత నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా ఎప్పటికీ రాజకీయ అడుగులు వేయడు ఎన్టీఆర్ అన్న విషయం అర్థమైంది. చంద్రబాబు, టిడిపి మీడియావాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా టిడిపికి దూరమయ్యే ఉద్ధేశ్యం మాత్రం ఎన్టీఆర్‌కి అస్సలు లేదు. చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసు.
2019ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీల వ్యూహప్రతివ్యూహాలకు అప్పుడే తెరలేచింది. టిడిపికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ బరిలో దిగడం ఖాయమైపోయింది. బిజెపితో…మరీ ముఖ్యంగా నరేంద్రమోడీతో బంధం గురించి చంద్రబాబుకు బోలెడన్ని భయాలున్నాయి. అందుకే పవన్, మోడీల కంటే కూడా ఎన్టీఆర్‌ని నమ్ముకోవడమే మంచిదన్న ఉద్ధేశ్యంలో చంద్రబాబు ఉన్నాడు. ఇఫ్పుడు కూడా ఎన్టీఆర్ ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తాడు? సొంత పార్టీ పెడతాడా? లాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వార్తలు కనిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌కి అలాంటి ఉద్ధేశ్యం అస్సలు లేదు. చంద్రబాబు అడిగిన వెంటనే టిడిపి తరపున ప్రచారం చేయడానికి సిధ్ధపడడం ఖాయం. టిడిపిలోకి రీ ఎంట్రీ ఇస్తే మాత్రం ఈ సారి ఎన్టీఆర్ వ్యూహాలు చంద్రబాబుకు కూడా అంతుపట్టని స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న యువ నాయకులు అందరికంటే ఎన్టీఆర్ రాజకీయ చరిష్మా చాలా ఎక్కువ. అలాగే ప్రచారం విషయంలో కూడా ఎన్టీఆర్‌కి సాటి వచ్చేవాళ్ళు లేరు. 2009లో దూకుడుగా వెళ్ళి దెబ్బతిన్న ఎన్టీఆర్…ఈ సారి ఎలాంటి వ్యూహాలతో వస్తాడో? పొలిటికల్ తెరపై కూడా తాను అనుకున్న టార్గెట్‌ని రీచ్ అవుతాడో? లేదో చూడాలి మరి.