తెలంగాణా రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర నాయకులను పట్టి పీడిస్తున్నట్టుంది. మనవాళ్ళు తోపులు, తురుంఖాన్లు, ఆరడుగుల బుల్లెట్స్…రాష్ట్ర విభజనను అడ్డుకుని తీరతారు అని సీమాంధ్ర ప్రజలందరూ గుడ్డిగా నమ్మేలా బోలెడన్ని ప్రగల్భాలు పలికారు. కానీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పులివెందుల పులిబిడ్డ, సమైక్యాంధ్ర హరో(?), ఆరడుగుల బుల్లెట్టు…అందరూ ఉత్తర కుమారులే అన్న విషయం సీమాంధ్ర ప్రజలకు చాలా ఆలస్యంగా అర్థమైంది. అయితే అప్పటికే చేతులు కాలిపోయాయి. కోలుకోలేనంత నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హతాశులయ్యారు. కులాభిమానులను పక్కన పెడితే మిగతా ప్రజలందరికీ కూడా అందరు నాయకులపైనా కోపమే వచ్చింది. ఆ వేడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక, తప్పించుకునే అవకాశం లేని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహ జ్వాలలో బూడిద అయిపోయింది. వర్గ మీడియా సపోర్ట్‌తో విభజన బిల్లుకు అనుకూలంగా ఓటేశారన్న విషయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిని మరల్చడంలో చంద్రబాబు, వెంకయ్యలు సక్సెస్ అయ్యారు. అంతకంటే కూడా చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న భావనతో, ఆయన ఇచ్చిన హామీలను నమ్మి, ఇస్తానన్న ఉచితాలకు ఆశపడి ఆయనకు అధికారం అప్పగించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయం పక్కన పెడితే సీమాంధ్ర నాయకులకు మాత్రం ఎక్కడో పాపభీతి ఉన్నట్టుంది. లేకపోతే రాష్ట్ర విభజన విషయంలో ఫెయిల్ అయ్యామన్న ఓటమి బాధ కూడా పట్టిపీడిస్తున్నట్టుంది. అందుకే విభజన జరగక ముందు క్షణం వరకూ ఆంధ్ర-తెలంగాణా అని పోలికలు తెచ్చి తిట్టరాని తిట్లు తిట్టిన కెసీఆర్ అండ్ కో విభజన తర్వాత నుంచి మాత్రం తెలుగు ప్రజలందరూ మానసికంగా కలిసుండాలి అనే పాట పాడుతూ ఉంటే, సీమాంధ్ర నాయకులు మాత్రం విభజన గాయాలను గుర్తు చేసే పనిలో బిజీగా ఉన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి బుక్స్ రాసేంత తీరిక లేదు కాబట్టి సమయం, సందర్భం లేకుండా, అవకాశం దొరికినప్పుడల్లా విభజనను విమర్శిస్తూ, చచ్చిన పాములాంటి కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ విభజన పాపం మొత్తం కాంగ్రెస్‌దే. టిడిపి, బిజెపికి ఆ పాపంలో భాగం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నా వైఫల్యం ఏమీ లేదు. నన్ను తొక్కేయడానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను విడగొట్టింది అని చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు.
ఇక విభజన వేడి తగ్గేవరకూ ఖాళీగా గోల్లు గిల్లుకుంటూ కూర్చున్న మేధావి(?) ఉండవల్లి కూడా వేరే పని ఏమీ లేక… తన హీరోయిజం గురించే తనే డప్పు వాయించుకుంటూ ఓ బుక్కు రాసిపడేశారు. విభజన చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపిస్తానంటున్నాడు కానీ అదంతా కూడా చంద్రబాబు గురించి ఆంధ్రజ్యోతి ఎం.డి. రాధాకృష్ణ రాసే చరిత్రలా ఉంది. నిజాయితీగా జరిగిన చరిత్రను చెప్తే ఎవరూ విమర్శించరు కానీ…ఆయన చెప్తున్న చరిత్ర మొత్తం కూడా నేను హీరో, నేను మేధావి, సమైక్యాంధ్ర కోసం గొప్ప గొప్ప యుద్ధాలు చేసేశా అనే స్థాయిలో సినిమాటిక్ రైటింగ్ స్టైల్‌తో సాగుతోంది. పనిలో పనిగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు హీరోలుగా తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రమోట్ చేస్తున్నాడేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర హీరోలుగా ఉండవల్లి లాంటి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలి. అక్కడ తెలంగాణాలో జైపాల్‌రెడ్డి లాంటి వాళ్ళను తెలంగాణా హీరోలుగా గుర్తించాలి. ఇలాంటి రాజకీయ చాణక్యం గురించి బాగా తెలుసుకాబట్టే ఈయనను మేధావి అని పిలుస్తూ ఉంటారేమో మరి. వీళ్ళిద్దరే కాదు రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతున్న సీమాంధ్రుల మాటలన్నీ ఇలానే ఉంటున్నాయి. విభజన టైంలో ఏం చేయలేక…చేత కాక …పరాజితులనిపించుకున్న మన ఉత్తరకుమారులు ఇప్పుడు మాత్రం హీరోలం, పోరాట వీరులం అని అనిపించుకోవడానికి చాలా ‘హీరోచిత’ ప్రయత్నాలు చేస్తున్నారు. మాయ మాటలతో మరోసారి సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు.
అసలు సీమాంధ్ర నాయకులందరూ కూడా ఇలాగే ఎందుకు ఆలోచిస్తున్నారో, వీళ్ళ రాజకీయం మొత్తం ఇలాగే ఎందుకు తగలడుతోందో అర్థం కావడం లేదు. పనులు చేయడం కంటే కూడా మాటలనే ఎక్కువ నమ్ముకుని బ్రతికేస్తున్నారు. హోదా తీసుకురావడం చేతకాలేదు కానీ మాయమాటల ప్యాకేజీని మాత్రం ‘అంతకు మించి’ అని ఆంద్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు, వెంకయ్యలు అరవీర భయంకర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిది కూడా సేం పాలసీనే. ప్రత్యేక హోదా తీసుకురావడం కంటే కూడా ప్రత్యేక హోదా పోరాట వీరుడ్ని, హీరోని నేనే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అందుకే ‘పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు’……..ప్చ్.