నయీం ఎన్‌కౌంటర్‌ను రాజకీయం చేయొద్దని ఎంపి కవిత అంటున్నారు గాని నిజానికి జరగాల్సిందంతా రాజకీయ కోణం ఎంతమాత్రం విస్మరించడానికి లేదు. నయీమ్ నేర సామ్రాజ్యం గురించిన కథలు పుంఖానుపుంఖంగా కొనసాగుతున్నాయి. అయితే అధికార పూర్వక సమాచారం తక్కువ. క్రైమ్ విలేకరులకూ పోలీసులకూ రాజకీయ వర్గాలకూ చాలా పేర్లు తెలుసు. అయినా ప్రచురిత ప్రసారిత కథనాల్లో పేర్లు వుండకపోవడానికి చాలా కారణాలుంటాయి. . నయీం ఆగడాలపై ఒక మంత్రి స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు ఏడ్చాడని కూడా టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. నలుగురు ఎంఎల్ఎలు కూడా తమ బాధలు ఏకరువు పెట్టారట. ఒక క్రమ పద్ధతిలో నయీంను పాత నేస్తంలాగే పిలిపించి వారం రోజుల పాటు వివరాలన్నీ రాబట్టి ఎన్కౌంటర్ చేశారని అనేకులు అంటున్నారు.
మాజీనగ్జలైట్గా మొదలై పోలీసుల చేతులోపావుగా మారి మావోయిస్టుల ఆసుపాసులు అందించేందుకు నయీమ్ ఉపయోగపడ్డాడనేది బహిరంగ రహస్యం. అతనొక్కడే గాక కత్తుల సమ్మయ్య, పటోళ్ల గోవర్థనరెడ్డి, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి వంటి పేర్లు కూడా ఈ మాజీల జాబితాలో వుంటాయి. వారిలో సమ్మయ్య శ్రీలంకకు వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించాడు. ఇంకొందరు రకరకాల సంఘటనల్లో చనిపోయారు. కొంతమంది అసలు పత్తాలేకుండా పోయారు. లొంగిపోయిన, మారిపోయిన చాలా మంది మాజీ మావోయిస్టులు టిడిపి టిఆర్ఎస్,కాంగ్రెస్,వైసీపీ వంటి పార్టీల్లో ప్రజాప్రతినిధులుగా లేదంటే అధికార ప్రతినిధులుగా మాతోపాటు చర్చల్లోనూ కనిపిస్తుంటారు. ఆలాటి వారిలో ఒకరైన సాంబశివుడు తదితరులు ఎన్నికల ముందే హత్యలకు గురైనారు. నిజానికి సాంబశివుడు హత్య సమయంలోనే కెసిఆర్ నయీం విషయంలో దృఢమైన నిర్ణయం ప్రకటించారంటారు. అయినా చాలా కాలం పట్టింది 1993లో వ్యాస్ ఐపిఎస్ హత్య కేసులో లొంగిపోయి ఏడేళ్ల తర్వాత బయిటకు వచ్చి ే తన హిట్ లిస్టును ప్రకటించిన నయీమ్ పౌరహక్కుల కార్యకర్తలను రాజకీయ ప్రత్యర్తులను హతమార్చడంలో ముఖ్యపాత్రధారిగా వున్నట్టు వార్తలు వస్తూనే వున్నాయి. నయీం బాధితుల గోడు కూడా కొన్నిసార్లు బయిటకు వచ్చినా పోలీసులు విననట్టు నటించారు. పోలీసులు తమకు తాముగా ఇవన్నీ చేయలేరు గనక ప్రభుత్వాల వత్తాసు వుండాలి.
నయీం ఇంతగా పెరిగి దందాలు దాష్టీకాల కథలు మీడియాలో వస్తుంటే ఐపిఎస్లూ ఐఎఎస్‌లూ అధినేతలూ చూసిచూడనట్టు వుండిపోయారంటే కారణం వ్యవస్తల ఈ కుమ్మక్కు మాత్రమే. అదే వూపులో కొందరు ఆస్తులు ఆర్జన పెంచుకోవడానికి ఎలా తెగబడటం మరీ దారుణం. మిగిలిన సంగతులు అలా వుంచి అమాయకురాలైన అమ్మాయిలను వ్యభిచారిణులుగా మార్చి అక్రమ రవాణా చేస్తున్నా ఉపేక్షించారు. ఎన్కౌంటర్ల బాస్‌గా డిజిపి స్వర్ణజిత్సేన్ఒకప్పుడు మీడియా ముందే తుపాకి చూపించారు. చర్చలకు పిలిచిన మావోయిస్టులను కూడా వరుసగా హతమారుస్తూ వచ్చారు. డిజిపగా స్వయంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న దినేష్‌రెడ్డి వంటి వారు వేళ్లు తన్నిన ఈ నేరసామ్రాజ్యాన్ని గుర్తించలేకపోయారనుకోగలమా? వైఎస్‌కు దగ్గరమనిషిగా పేరున్న మాజీ డిజిపి మొదట వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత బిజెపిలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా నయీమ్‌ను కలుసుకున్నట్టు చెబుతున్న స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబి) అధిపతి శ్రీరాం తివారికి అతనిలోని మరో కోణం చూచాయగానైనా తెలియరాలేదా? మరికొందరు ఉన్నతాధికారులకు కూడా అతనితో సంబంధాలు వుండే అవకాశం వుందని తివారి అంటున్నా వారిలో ఎవరూ ఎప్పుడూ ఎందుకని ఈ విషవలయం ఛేదించడం గురించి ఆలోచించలేకపోయారు. వారికీ సంబంధాలున్నాయా లేక సంబంధాలున్నవారు ఒత్తిడి చేశారా?
నగ్జలైట్టు/మావొయిస్టుల ఖతం కార్యక్రమం, తుపాకి గొట్టం సిద్ధాంతంతో ఏకీభవించకపోయినా ప్రజాస్వామికవాదులెప్పుడూ ఎన్కౌంటర్లను సమర్థించలేదు. అచ్చంగా ఇందుకోసం సృష్టించిన గ్రేహౌండ్స్ దళాధిపతి వ్యాస్ హత్య కేసులో 1993లో అరెస్టయిన నయీమ్‌తో పోలీసులు ఎలా చేతులు కలిపారని మాజీ పోలీసు అధికారి రావులపాటి సీతారామరావు ఆంధ్రజ్యోతి వ్యాసంలో వేసిన ప్రశ్న వేశారు. వ్యాస్ హత్యకేసువిచారణకు నియమితుడైన బాధ్యుడికి ప్రదాన సాక్షి (దినేష్ రెడ్డి) సహకరించలేదని ఒక సీనియర్ ఐపిఎస్ నాతో అన్నారు. పైగా ‘గబ్బర్ సింగ్’ అనిపించుకున్న ఆ విచారణాధికారిని తర్వాత కాలంలో కేసులతో వేధించితే ఎలాగో బయిటపడ్డారట. (ఈయన ప్రేరణతోనే తన సినిమాకు టైటిల్ పెట్టానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు)ి. హైదరాబాదులో లుంబినీ, దిల్షుక్నగర్ ఘటనల వంటివి జరిగి ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్ తీవ్రవాదం వంటి వాటి గురించి అంత హడావుడి చేసిన వారు పెరట్లో తము పోసిన పాలుతాగి పెరుగుతున్న సర్పానికి మాత్రం స్వేచ్చనిచ్చేశారు. కోవర్టుల ముద్రతో నిస్వార్థ రాజకీయ కార్యకర్తలను బలహీనులను కూడా ఎంతోామందిని హతమార్చిన మావోయిస్టుల హిట్‌లిస్టులో నయీం లేకపోవడం కూడా గమనించదగ్గది. పోలీసులు ఇప్పుడేదో హఠాత్తుగా అతని స్థావరాలు తెలిసి దాడి చేసినట్టు చెబుతున్నారు గాని చుట్టుపక్కల కుర్రాళ్లకు కూడా వాటిగురించి తెలుసు. కాకపోతే అతనిచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని లనేక ఎనౌకౌంటర్లు చేసి ఇప్పుడు అతనికీ అదే ముగింపునివ్వడం పోలీసున్యాయం. ఒక దశలో జాతీయంగా సంచలనం కలిగించి ప్రస్తుత బిజెపి అద్యక్షుడు అమిత్‌షా రాజకీయ భవితకు ముప్పుగా మారిన సోరాబుద్దిన్ ఎన్కౌంటర్ ఘటనలోనూ నయీం పేరుంది. అలాగే గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షా ప్రత్యర్థి హీరేన్ పాండ్యా హత్యలోనూ వినిపించింది. ప్రధాని మోడీ పర్యటన వెనువెంటనే ఈ ఎన్కౌంటర్ చేయడం రాజకీయ కానుకా అని కాంగ్రెస్ మాజీ ఎంపి మధుయాష్కి వ్యాఖ్యానించారు. ఏమైతేనేం నయీంను పట్టుకుని గుట్టుమట్టులు లాగకుండా మట్టుపెట్టడంతో సత్యాలు సమాధి అయ్యాయి.
కొమ్మలు నరికినా భూమిలో చెట్టు వేళ్లు వుంటాయన్నట్టుగానే ఒక ఘరానా నేరస్తుడిని హతంచేసినంత మాత్రాన నేర సామ్రాజ్యం అంతరించిపోదు. దావూద్ ఇబ్రహీం తరహాలో నయీం వారసుడెవరనేదానిపైనా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రపంచీకరణ మిగిలిన విషయలలాగే నేరాలను కూడా అంతర్జాతీయం ఆధునికం చేసింది. నయీం కూడా వందలకోట్లతో దుబారు వెళ్లిపోయి తర్వాత రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నట్టు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం పాలకపక్షంలో వున్న ఎంపి ఒక ప్లాట్ కూడా తీసి వుంచారట. కనుక నయీం వందల కోట్లు కూడబెట్టుకోవడానికి వెనకనున్న శక్తులెవరు?
లెక్కపెట్టిన నోట్ల కట్టల గురించి దొరికిన ఆయుదాల గురించి కథలు ఆసక్తి రేకెత్తిస్తాయే తప్ప ఈ తరహా నేరాల నివారణకు దోహదం చేయవు. వివరాలన్నీ రాబట్టామని పోలీసులు చెప్పినంత మాత్రాన ఇంటిగుట్టు బయిటపెట్టుకుంటారని నమ్మడం కష్టం. వందల సంఖ్యలో వున్న బాధితులు, మామూలు పోలీసులు ముందకొచ్చి నిజానిజాలు చెప్పాలంటే వారికి భరోసా ఇవ్వగలగాలి.రాజకీయ అనుబంధాలకు అతీతంగా పారదర్శకంగా సమగ్ర విచారణ జరిగితేగాని నిజంగా డొంక కదలదు. పోలీసు అధికారులతో సిట్ వేసినంత మాత్రాన వూడలుతన్నిన ఈ రాక్షస మర్రి మూలాలు తేలవు. వారు నిజాయితీ పరులైతే కావచ్చు గాని దీన్ని పరిమితం చేస్తే ి ప్రమాదకర శక్తులతో పెనవేసుకుపోయిన రాజకీయ వేత్తలు వ్యాపారవర్గాలు అధికారులు అన్నిటినీ మించి పోలీసు బాసుల పాత్ర భూస్థాపితం అయిపోతుంది. అందుకనే న్యాయ విచారణ జరపాలన్న కోర్కె బలంగా వినిపిస్తున్నది. సిబిఐకి అప్పగించాలని కూడా కొన్ని పార్టీలు కోరుతున్నాయి. . చాలా ఏళ్లు నుంచి – ఇప్పటికి కూడా -శాంతి భద్రతలకు స్వయంగా బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రులైనా పదేపదే వెల్లడవుతున్న ఈ వికృత బంధాన్ని ఎందుకు ఎలా అనుమతించారు? విజన్‌కు పేరు గాంచిన సిఇవో ముఖ్యమంత్రులైనా రోజువారి నివేదికల్లో ఈ సంగతులు లేవేమని నిలదీయలేదా? లేక నయీం విజన్‌కు నగిషీలు చెక్కారా?ఇంత జటిలమైన వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రాన్ని నిందించవచ్చు గాని తెలంగాణ వచ్చాక రెండేళ్లు దందా నడివనిచ్చారే?సెటిల్మెంట్లు దందాలు కబ్జాలు చేసే రాజకీయ పెద్దలు బడా బాబులు ఇంకా వున్నారు గనక నయీంతోనే అవన్నీ ముగిసిపోవు. . టిఆర్ఎస్ ఎంపిలు ఎంఎల్‌లు మంత్రుల పేర్లు కూడా బాధితులగా భాగస్వాములుగా వినిపిస్తుంటే విస్మరించడం ఎలా సాధ్యం? కాబట్టి జరగాల్సింది చాలా వుంది.