రాజకీయ నాయకుడు అంటే అంతేనేమో….ప్రతి విషయాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారేమో. సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల…కాదేదీ కవితకనర్హం అన్నట్టుగా అమ్మ, ఆలీ, చెల్లి, అన్న, తమ్ముడు, పుట్టిన ప్రాంతం, కులం, మతం….కాదేదీ రాజకీయ స్వార్థానికి అతీతం అని చెప్తే ఇంకా బాగుంటుంది. మన తెలుగు నాట చంద్రబాబు-బాబుగోరి మనవడి సెంటిమెంట్ సినిమాను హృదయానికి హత్తుకునే సెంటిమెంట్‌తో, విన్నవాళ్ళు, కన్నవాళ్ళందరూ కూడా వలవలా ఏడ్చేలా టిడిపి అనుకూల మీడియా మొత్తం కూడా మనకళ్ళకు అద్భుతంగా చూపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేష్‌బాబు కూడా అనుకూల మీడియాకు అవసరమైన దినుసులన్నీ మాటల్లోనూ, చేతల్లోనూ ఇచ్చేశారు. ప్రజలందరికీ కూడా బాబూ-మనవడి కథ రీచ్ అయింది అని తెలిశాకే ఆ సెంటిమెంట్ సినిమాకు ముగింపు పలికారు. సినిమా హీరో కమ్ జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. తన మూడో భార్య క్రిస్టియిన్ అని చెప్పి ఆ వర్గం ఓట్ల కోసం ఓ ప్రయత్నం చేశారు పవన్. ఇక వైఎస్ జగన్ వాడకం గురించి చెప్పేదేముంది. బైబిల్‌తో అమ్మ, జగన్ వదిలిన బాణంలా వచ్చిన చెల్లితో తండ్రిలేని పిల్లాడు అయిన జగన్ పండించిన సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. అలాగే ప్రాంతంతో కెసీఆర్, మతంతో ఒవైసీలు ఆడే రాజకీయ ఆటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
చంద్రబాబు, జగన్, కెసీఆర్, పవన్, ఒవైసీలు అంటే ఏదో రాష్ట్ర స్థాయి నాయకులు అని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నరేంద్రమోడీ కూడా ఆయన రాజకీయ స్వార్థం కోసం వృద్ధురాలు అయిన మాతృమూర్తిని ఉపయోగించుకోవడం మాత్రం అందరూ ఖండించాల్సిన విషయమే. ఓట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెను బ్యాంకుకు వచ్చి క్యూలో నిలబడేలా చేయడం…..ఆ ఫొటోలతో బిజెపి చేసిన రాజకీయాన్ని ఎక్కువ మంది ప్రజలు విమర్శించారు. కానీ ఆ ఎపిసోడ్‌కి ఇప్పుడిప్పుడే ముగింపు పలికేలా లేడు మోడీ. మోడీ విషయం అలా ఉంటే ప్రధానమంత్రి మోడీ చేసే పనులన్నింటినీ తిడుతూ ఉంటే చాలు……ఏదో ఒకరోజు నేను కూడా ప్రధానమంత్రిని అయిపోతా అని ఫీలవుతూ ఉంటాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అమ్మ సెంటిమెంట్ సినిమాతో ముందుకొచ్చాడు. ఎప్పుడైనా ఒకరోజు అమ్మతో ఉండడం కాదు…..నాలా ఎప్పుడూ అమ్మతో, భార్యతో కలిసి ఉండు అని చెప్పి ఈయనగారు మోడీకి సుద్దులు చెప్తున్నారు.
వారెవ్వా….వాట్ ఎ రాజకీయం అప్పా……అందరూ చదువుకున్నవాళ్ళే….మైకు దొరికితే చాలు…సంస్కారం గురించి, మానవీయ విలువల గురించి, స్వార్థం లేకుండా బ్రతకడం గురించి గంటలు గంటలు సందేశాలు, ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎంత దిగజారి అయినా ఎవ్వరినైనా, దేన్నైనా వాడుకోవడానికి రెడీ. ఈ నాయకుల ఫ్యామిలీ రిలేషన్స్, కులం, మతం, ప్రాంతం లాంటి వాటితో జనాలు ఒరిగేది ఏమైనా ఉందా? దేశం మొత్తం మీద ఏ కులం, మతం, ప్రాంతం నాయకుడైనా సరే….ఆయన కులపువాళ్ళను, మతంవాళ్ళను, ప్రాంతం వాళ్ళందరినీ అభివృద్ధి చేశాడా? స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి జాతిపిత ఇంటి పేరుతో సహా కుటుంబం, కులం, మతం, ప్రాంతం….అంటూ సెంటిమెంటును రగిలిస్తూ, భావోద్వేగాలను రెచ్చగొడుతూ రాజకీయ స్వార్థ ప్రయోజనాలను మాత్రం పొందుతూ ఉన్నారు. ఈ ట్రెండ్ ఎప్పటికైనా మారే ఛాన్స్ ఉందంటారా?