రాజకీయాలు ఎప్పుడూ పాలకుల్ని బట్టి ఉంటాయి. పాలన చేసే వారి విధానాలను బట్టి ఉంటాయి. పాలన ప్రజా వ్యతిరేకంగా సాగుతూంటే.. విపక్ష పార్టీలన్నీ మిగతా సమస్యలను పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోరాటం చేస్తాయి. అదే పాలకుడు ఇతర సమస్యలేమీ పట్టించుకోకుండా కేవలం ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టి పాలన చేస్తే.. ఇతర విపక్ష పార్టీలకు… వారి వందిమాగధులకు ఇతర సమస్యలేమీ ఉండవు. అందుకే ప్రజలతో సంబంధం లేని కులాలు, మతాలు, విగ్రహాల పేరుతో రచ్చ ప్రారంభిస్తారు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే.
జగన్ రెడ్డి హయాంలో అన్నీ ప్రజా సమస్యలపై ఆందోళనలే
జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరగని ఆందోళన లేదు. ప్రతి వర్గం రోడ్డెక్కి నిరసనలు తెలిపేది. విపక్ష పార్టీల నేతల్ని వేధించినా అందరూ పోరాట పటిమ చూపించేవారు. అందరి ఎజెండా అప్పటి పాలకుడి నేతృత్వంలో జరుగుతున్న ఘోరమైన తప్పిదాలు, ప్రజా వ్యతిరేకత విధానాలను వ్యతిరేకించి.. ప్రజా పోరాటం చేయడమే. కులాలు, మతాల, విగ్రహాల అంశం అసలు తెరపైకి వచ్చేది కాదు. అంతా ప్రజా కోణలోనే ఉండేది. జగన్ రెడ్డి ఘోరమైన పరిపాలనపై పోరాటం చేయడమే ఏకైక ఎజెండాగా ఉండేది. అప్పట్లో వివక్షలకు అంత పని , అవకాశం కల్పించారు.
చంద్రబాబు పాలనలో పనిలేని విపక్షాలు
చంద్రబాబు పరిపాలన అంతా ప్రజా కోణంలో జరుగుతుంది. ఏ అంశంపై పోరాటం చేయాలో విపక్షాలకు తెలియడం లేదు. అభివృద్ధి పనులు పట్టాలెక్కాయి. సంక్షేమంలో వంకలు పెట్టలేకపోతున్నారు. అందుకే కులాలు, మతాలు, విగ్రహాల పేరుతో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేని రాజకీయాలను చేస్తున్నారు. గత వారం వంగవీటి రంగా విగ్రహంపై కొంత మంది దాడి చేశారు. నిన్నటికి నిన్న శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని రచ్చ చేయాలనుకున్నారు. అదే సమయంలో తిరుపతిపై రోజువారీ ఫేక్ న్యూస్ ఎటాక్ చేస్తున్నారు. విపక్షాలకు ఇంత కంటే పెద్ద సమస్యలు లేకుండా పరిపాలన చేయడమే చంద్రబాబు చేస్తున్న పొరపాటన్న అభిప్రాయం వినిపిస్తోంది.
విపక్ష పార్టీలు ప్రజల మనసు గెలుచుకోవడంపై దృష్టి పెట్టాలి !
విపక్ష పార్టీలు .. ప్రజల్ని తాత్కలిక అంశాలపై రెచ్చగొట్టడం ద్వారా ఏదో సాధింవచ్చని అనుకుంటే సమస్యల్లో ఇరుక్కుంటారు. ప్రజా కోణంలోనే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. విగ్రహాలను ధ్వంసం చేసి రాజకీయం చేద్దామనుకోవడం… విగ్రహాలకు కులాలను ఆపాదించడం.. ఎన్టీఆర్ పై ఏదో రకంగా నిందలేయడం చేస్తే.. తాము బలపడతామనుకోవడం పొరపాటు. ప్రజా సమస్యలపై విపక్షాలు దృష్టి పెట్టాలి. చంద్రబాబు పరిపాలనలో ప్రజా సమస్యలపై చర్చిచండానికి ఏమీ ఉండదన్నట్లుగా విపక్షాలు చేస్తే…అది టీడీపీకి .. చంద్రబాబు పాలనకు పెద్ద సర్టిఫికెట్ అవుతుంది. విపక్షాల చేతకానితనం అవుతుంది.