ఈవారం విడుదలైన సినిమాల్లో ‘సుందరకాండ’కు మంచి టాక్ వచ్చింది. నారా రోహిత్ కు కమ్ బ్యాక్ దొరికిందని, సినిమాలో ఫన్ బాగా వర్కవుట్ అయ్యిందని, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ఉందని రివ్యూలు చెప్పాయి. తీరా చూస్తే… థియేటర్లలో జనాలు లేరు. ఇంత టాక్ వస్తే… కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. పైగా ఇది పండగ సీజన్. పెద్దగా పోటీ కూడా లేదు. కాబట్టి… వసూళ్లు కనీసం యావరేజ్ మార్క్ దగ్గర ఆగుతాయి. కానీ ‘సుందర కాండ’ పరిస్థితి మాత్రం తేడాగా ఉంది. టాక్ బాగున్నా.. జనం లేరు. బుధవారం విడుదల చేయడం మైనస్ అనుకొంటే.. అది పండగ రోజు. కనీసం ఫస్ట్ షో, సెకండ్ షోకైనా పికప్ అవ్వాలి. గురువారం కూడా ఇదే పరిస్థితి. లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి… ఏదోలా పుష్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే శుక్రవారం సక్సెస్ మీట్ పెట్టింది.
ఈ సందర్భంగా వసూళ్ల గురించి కూడా నారా రోహిత్ మాట్లాడారు. ”వసూళ్లు మరీ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పను కానీ, ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. టికెట్ రేటు కూడా అందుబాటులో ఉంచాం. శని, ఆదివారం.. ఇంకా రెండు రోజులు ఉన్నాయి. కచ్చితంగా జనాలు థియేటర్లకు వస్తారన్న నమ్మకం ఉంది” అన్నారు. సినిమాలకు మౌత్ టాక్ తెచ్చుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ఆ విషయంలో సక్సెస్ అయినా కూడా వసూళ్లు లేకపోవడం ఆశ్చర్యమే. నారా రోహిత్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండడం, రోహిత్ మినహాయిస్తే పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవడం, దర్శకుడు కొత్తవాడు కావడం.. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించి ఉండొచ్చు. ఇంకో రెండు రోజుల సమయం ఉంది కదా? రోహిత్ చెప్పినట్టు పికప్ అవ్వడానికి ఒక్క రోజు చాలు. సుందరకాండ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.