ప్రపంచ క్యాథలిక్కులకు మత గురువుగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. ఆయన ఇటీవల డబుల్ న్యుమోనియా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వాటికన్ వర్గాలు ప్రకటించాయి. ఇటీవల రోమ్‌లోని రెజీనా కోయెలి జైలును సందర్శించారు . ఆదివారం ఈస్టర్ వేడుకల్లోనూ కనిపించారు. హఠాత్తుగా ఈ ఉదయం ఆయన చనిపోయినట్లుగా వాటికన్ వర్గాలు ధృవీకరించాయి.
పోప్ అర్జెంటీనాలో జన్మించిన ఇటలీ వలస దంపతుల కుమారుడు. హైస్కూల్లో కెమికల్ టెక్నీషియన్‌గా శిక్షణ పొందారు. తర్వాత ఫిలాసఫీ ,థియాలజీలో డిగ్రీలు చేశారు. చదువు అయిపోయాక ఒక బార్లో బౌన్సర్‌గా, కస్టోడియన్‌గా , కెమికల్ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేశారు. చిన్న వయసులోనే 1950లోనే తీవ్రమైన న్యుమోనియా కారణంగా కుడి ఊపిరితిత్తిలో ఓ భాగాన్ని వైద్యులు తొలగించారు. 1958లో సొసైటీ ఆఫ్ జీసస్ లో చేరారు. ఆ తర్వాత మెల్లగా అనేక పదవులలోకి వెళ్లారు. 2001లో పోప్ జాన్ పాల్ II చేత కార్డినల్‌గా నియమితులయ్యారు. పోప్ బెనెడిక్ట్ రాజీనామా తరవాత పోప్‌గా ఎంపికయ్యారు.
పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు వాటికన్లోని చర్చి తాత్కాలిక నిర్వాహకుడు మరణాన్ని అధికారికంగా ధృవీకరించాలి. ఆ ప్రక్రియ పూర్తయినట్లుగా అంతర్జాతీయ మీడియా చెబుతోంది. 15-20 రోజులలోపు కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు 120 మంది కార్డినల్స్ ఓటు హక్కు ద్వారా పోప్ ను ఎంచుకుంటారు. పోప్ ఎంపిక ఆసక్తికరంగా ఉంటుంది. పొగ ద్వారా ఈ ఎన్నికల సంకేతాలు పంపుతారు.