ప్రభాస్ ‘రాజాసాబ్’ ఇప్పుడు కాస్త డిఫరెంట్ జోన్లో పడింది. సినిమా టాక్ బాలేదు. కానీ రెవిన్యూ మాత్రం బాగుంది. సినిమాకి నెగిటీవ్ టాక్ వచ్చినా, ఈమాత్రం వసూళ్లు చేయగలుగుతోందంటే అది కేవలం ప్రభాస్ చలవే. అదే.. సినిమాకు ‘హిట్’, ‘సూపర్ హిట్’ టాక్ వస్తే ఎలా ఉండేదో ఏమో..? ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ఓ వర్గం ప్రభాస్ ని తప్పుపడుతుంటే, మరో వర్గం మారుతిని టార్గెట్ చేస్తోంది. ఇంతకీ… ‘రాసాజాబ్’ ఇలాంటి రిజల్ట్ రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఈ పొరపాటులో ఎవరి వాటా ఎక్కువ వుంది?
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతిని నమ్మి ఓ ప్రాజెక్ట్ అప్పగించడం మామూలు విషయం కాదు. అసలు ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లడమే ఓ మెరాకిల్. మారుతితో సినిమా చేయాలన్నది పూర్తిగా ప్రభాస్ నిర్ణయమే. అంతేకాదు… మారుతితో ఎలాంటి సినిమా చేయాలి? అనేది కూడా ప్రభాస్ స్వయంగా నిర్ణయించుకొన్నది. మారుతికి హారర్ జోనర్ పై టచ్ ఉంది. అందుకే ఆ జోనర్ లో సినిమా చేస్తే బాగుంటుందని ప్రభాస్ డిసైడ్ అయ్యాడు. ‘నాకో యాక్షన్ కథ కావాలి’ అంటే మారుతి అదే రాసేవాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే జోనర్ కూడా పూర్తిగా ప్రభాస్ చేతుల్లోనే ఉందన్నమాట.
‘ఇది ప్రభాస్ బాగా ఇష్టపడి, తన కిచెన్ లో తయారు చేసుకొన్న వంటకం’ అని మారుతి ఓ సందర్భంలో చెప్పారు. అంటే తన ఇన్వాల్వ్ మెంట్ ఎంత ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఈ సినిమాలో కథానాయికల ఎంపిక దగ్గర్నుంచి, బాలీవుడ్ సాంగ్ రిమిక్స్ చేయడం వరకూ అన్నీ ప్రభాస్ ఇష్ట ప్రకారమే జరిగాయి. ఎడిటింగ్ కూడా ప్రభాస్ దగ్గరుంచి చేయించుకొన్నాడని టాక్. ఓల్డ్ గెటప్ లో ఫైట్ కూడా ప్రభాస్ కావాలని పక్కన పెట్టారని, అయితే ఆ తరవాత అభిమానుల కోరిక మేరకు యాడ్ చేశారని తెలుస్తోంది. డబ్బింగ్ విషయంలో ప్రభాస్ కేర్ తీసుకోలేదు. చాలా చోట్ల డైలాగులు సరిగా వినిపించలేదు. ఇవన్నీ ప్రభాస్ వైపు కనిపిస్తున్న తప్పులు.
మారుతి కూడా రైటింగ్ విషయంలో ఇంకా శ్రద్ద పెట్టాల్సింది. మారుతి కామెడీ టైమింగ్ బాగుంటుంది. అది ఈ సినిమాలో మిస్సయ్యింది. ప్రభాస్ లాంటి కటౌట్ ని యాక్షన్ సీన్లలో సరిగా వాడుకోలేదు. కథని గ్రిప్పింగ్ గా చెప్పలేకపోయాడు. ఇవన్నీ మారుతి నుంచి కనిపిస్తున్న లోపాలు. మొత్తానికి ఇద్దరూ కలిసి అభిమానులకు అసంతృప్తి మిగిల్చారు. మారుతి అయితే తన చేతికి వచ్చిన ఓ అవకాశాన్ని చేజార్చుకొన్నాడు. ప్రభాస్ స్టార్ డమ్ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొన్నాడన్న విమర్శల్ని ఎదుర్కోవాల్సివస్తోంది. ఈ తప్పులు నుంచి వీరిద్దరూ వీలైనంత త్వరగా పాఠాలు నేర్చుకొంటే మంచిది.
