ఎవరనుకొన్నారు… తెలుగు సినిమా వసూళ్లలో బాలీవుడ్ ని మించిపోతుందని..?
ఎవరు ఊహించారు… మన సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొంటారని..?
ప్రాంతీయ సినిమా.. పాన్ ఇండియా సినిమాగా ఎదిగి.. వరల్డ్ సినిమాగా రూపాంతరం చెందుతుందని ఎవరు కలగన్నారు…?
ఇవన్నీ సాధించి చూపించిన హీరో.. ప్రభాస్.
బాహుబలితో తెలుగు సినిమాని ప్రపంచ పటంపై వెలిగేలా చేశాడు. బాహుబలి స్వప్నం వెనుక, కష్టం వెనుక, వ్యూహం వెనుక రాజమౌళి ఉండొచ్చు. కానీ తన ఆయుధం మాత్రం ప్రభాసే.
యుద్ధం రాజమౌళినే చేశాడు. కానీ తన సైన్యం మాత్రం ప్రభాసే.
దర్శకుడ్ని గుడ్డిగా నమ్మి – తన కెరీర్‌లోని అతి విలువైన ఐదేళ్లు ధారాదత్తం చేశాడు. దానికి ప్రతిఫలమే ఈ రోజు మనం చూస్తున్న పాన్ ఇండియా ఇమేజ్.
సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన వెంటనే డౌన్ ఫాల్ మొదలైపోతుంది. ఎలాంటి సినిమా చేయాలి.. ఎవరితో చేయాలి? అనే తికమక. ఆ గందరగోళంలో పొరపాట్లు చేయడం.. కింద పడిపోవడం.. చాలా సాధారణం. కానీ ప్రభాస్ తన వ్యూహం తానే రచించుకొన్నాడు. `బాహుబలి` అయిన వెంటనే.. ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజిత్ తో `సాహో` పట్టాలెక్కించాడు. పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేసే అనుభవం లేని రాధా కృష్ణతో `రాధే శ్యామ్` మొదలెట్టాడు. ఈ జనరేషన్లో టచ్ చేయడానికి భయపడే జోనర్ లో `ఆది పురుష్` ఎంచుకొన్నాడు. సైన్స్ ఫిక్షన్ `కల్కి` చేశాడు. ఇక తనకు మాత్రమే సరిపడే `సలార్`లా కనిపించాడు. ఇప్పుడు `రాజాసాబ్` ఓ హారర్ థ్రిల్లర్. ఇలా ఒక సినిమాకీ మరో సినిమాకీ సంబంధం లేని జోనర్లు ఎంచుకొంటున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక సర్ప్రైజ్ తో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.
ఇంత పెద్ద స్టార్ డమ్ వచ్చాక హీరోలు అలెర్ట్ అయిపోతారు. రెండేళ్లకు ఒక సినిమా, మూడేళ్లకు ఒక సినిమా అంటూ బద్దకిస్తారు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. ఒకేసారి రెండు మూడు సినిమాలు పట్టాలెక్కించేస్తున్నాడు. కాల్షీట్లు అందరికీ సమానంగా పంచుతున్నాడు. ఇప్పుడు తాను చేస్తున్నవన్నీ రూ.400 నుంచి రూ.500 కోట్ల సినిమాలే. ఆరకంగా ఇండస్ట్రీని యాక్టీవ్ చేసేస్తున్నాడు. ఇది చాలా చాలా అవసరం. హీరోలు తాము వ్యక్తిగతంగా ఎదగడమే కాదు.. సినిమా పరిశ్రమ ఎదుగుదలనీ కోరుకోవాలి. అలా కోరుకొన్నవాడే ఇన్ని సినిమాలు చేయగలుగుతాడు. ఈ విషయంలోనూ ప్రభాస్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ప్రభాస్ వ్యక్తిత్వం. తనపై ఎలాంటి కాంట్రవర్సీలూ ఉండవు. ఎప్పుడూ హద్దు దాటి మాట్లాడడు. అసలు మాట్లాడడమే గగనం అనుకొంటున్నప్పుడు.. ఏం మాట్లాడినా అపురూపం అనుకొంటున్నప్పుడు ఆ మాటలెప్పుడూ మధురంగానే ఉంటాయి. తన చుట్టుపక్కల వాళ్లని, స్నేహితుల్ని, తన అనుకొన్నవాళ్లని ఎప్పుడూ ప్రభాస్ కాపుకాస్తూనే ఉంటాడు. ఎవరికీ తెలియకుండా చేసే గుప్త దానాలు ఎన్నో. అవన్నీ సాయం పొందినవాళ్లకే తెలుస్తాయి. ప్రభాస్ ఆతిథ్యం గురించి, ఆ ఇంటి భోజనాల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ వెంట.. ఎప్పుడూ ఓ పాతిక మంది ఉంటారు. రాజు ఒక్కడే ఎందుకొస్తాడు.. వెంట సైన్యం ఉండాలిగా.
రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2.. ఓహ్… ఇలా చెప్పుకొంటూ పోతే ప్రభాస్ సినిమాల లిస్టు పెద్దదే. 365 రోజులూ ఏదో ఓ సినిమాతో బిజీగా ఉండే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కడేనేమో. తను ఇలానే సినిమాలు చేయాలి.. అభిమానుల్ని అలరిస్తూనే ఉండాలి.. తెలుగు సినిమా కీర్తి పతాకని రెపరెపలాడిస్తూనే ఉండాలి..
హ్యాపీ బర్త్ డే ప్రభాస్…
