మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల ఘన విజయాలు సాధించింది కానీ.. ఒక్క ఫిరాయింపు ఎమ్మెల్యే చేతిలో మాత్రం పరాభవానికి గురైంది. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యే ఎవరో కాదు.. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఆయనను కాంగ్రెస్ చేర్చుకున్నా ఆయన బీఆర్ఎస్ కోసం పని చేశారు. పటాన్ చెరులో ఉన్న ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ ను గెలిపించారు. ఇందు కోసం బోలెడంత ఖర్చు పెట్టారు కూడా. అంతే కాదు..బుల్లెట్ దిగిందా లేదా అని కూడా డైలాగ్ చెప్పి ముల్లుతో పొడిచారు.
నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ను మట్టికరిపించి, గులాబీ జెండా ఎగిరేలా చేయడంలో మహిపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడమే కాకుండా, క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “బుల్లెట్ దిగిందా లేదా?” అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్ విసిరినట్లుగా ఆయన డైలాగులు చెప్పారు.
మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పటి నుండి స్థానిక నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వంటి వారితో ఆయనకు పొసగ లేదు. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, పైగా తన ప్రత్యర్థి వర్గానికి ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నే గెలిపించాలని ప్రచారం కూడా చేశారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఆయనను పట్టించుకోలేదు. ఫిరాయించిన నేతల్ని మళ్లీ చేర్చుకునేది లేదని బీఆర్ఎస్ ప్రకటించింది. మరి ఐదు మున్సిపాలిటీలను గెలిపించిన మహిపాల్ రెడ్డిని రానిస్తుందా?
