ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రభాస్ సినిమాకు ‘ఫౌజీ’ అనే పేరు పెట్టబోతున్నారని తెలుగు 360 ముందే చెప్పింది. ఆ తరవాతే.. ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్రబృందం కూడా ఈ టైటిలే ఫిక్స్ చేసింది. ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు… ఈ సందర్భంగా ఫౌజీ టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించేశారు.
స్వాతంత్య్ర ఉద్యమం నాటి కథ ఇది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ కీ, ఈ కథకూ సంబంధం ఉంది. అందుకే `ఫౌజీ` అనే టైటిల్ పెట్టారు. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, పాండవుల పక్షాన కర్ణుడు, పుట్టుకతోనే ఒక యోధుడు, గురువు లేని ఏకలవ్యుడు, మన చరిత్రలోని దాగున్న అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ.. అంటూ ఫౌజీని పరిచయం చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావొచ్చు.
యుద్ధ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉన్న కథ ఇది. ఆయా యాక్షన్ ఘట్టాలు అభిమానుల్ని అలరించేలా తీర్చిదిద్దారు. నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఓ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనురకొన్నారు. దానికి సంబంధించిన కొంత మేర వర్క్ కూడా జరిగింది. కానీ చివరికి పోస్టర్ తో సరిపెట్టారు. ఈ రోజు ‘రాజాసాబ్’ నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ రాబోతోంది.