చంద్రయాన్‌-2 రాకెట్‌ను బాహుబలి అనడంపై స్పందించిన ప్రభాస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రుడిపై పరిశోధనల చేపట్టేందుకు పంపిన చంద్రయాన్‌ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్-2ను తీసుకెళ్తున్న ఇస్రో పంపిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 రాకెట్‌ను బాహుబలి అని అంటున్నారు. ఇది 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించి సెప్టెంబర్‌ 7న చంద్రుడిపైకి చేరనుంది.

ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. హలో డార్లింగ్స్.. ఇది భారతీయులంతా గర్వపడే రోజు. ఇస్రో.. చంద్రయాన్ 2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. చంద్రయాన్ 2ను పంపిన రాకెట్‌ను బాహుబలి అని పిలవడంతో మా బాహుబలి సినిమా టీమ్ మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవం. ఈ ప్రయోగం మన దేశానికి మరింత పవర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ప్రభాస్.

చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై ప్రభాస్‌తో పాటు చాలా మంది సినీ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన క్షణాలను భారతీయులంతా గుర్తుంచుకుంటారని జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు తన తరపున, జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు పవన్.

ఇస్రో చరిత్ర సృష్టించిందని, చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రయోగించినందుకు శుభాకాంక్షలని దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేర్కొన్నారు. చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు, భారత్‌ మరో ఘనత సాధించిందని హీరో నాగార్జున తెలిపారు. చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు శుభాకాంక్షలని మంచు విష్ణు పేర్కొన్నారు. చాలా గర్వంగా ఉంది ఇస్రో, ఇది గొప్ప ప్రారంభం, చాలా ఆనందంగా ఉందంటూ హీరో మాధవన్‌ పోస్ట్ చేశారు.

ఇక చంద్రయాన్ 2 విజయవంతంపై ఖుష్బూ సింపుల్‌గా జైహింద్‌ అంటూ తన దేశభక్తి చాటుకున్నారు. ఇది గర్వించాల్సిన సమయమంటూ చంద్రయాన్ 2 విజయంపై తాప్సి స్పందించారు. చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రోకు ఆల్ ది బెస్ట్‌ చెబుతూ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పోస్ట్ చేశారు.

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించే అవకాశం రావడం నిజంగా మన అదృష్టం, మహిళల సారధ్యంలో ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహం అంటూ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు కరణ్‌ జోహార్‌. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని నమ్మకంతో విజయవంతం చేసిన ఇస్రోకు శుభాకాంక్షలని షారుక్‌ ఖాన్‌ తెలిపారు. ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిందంటూ బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com