అసెంబ్లీలో చిరంజీవిని ప్రశంసిస్తున్న టిడిపి మరియు వైకాపా నేతలు

చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంత కాలం, చిరంజీవికి రాష్ట్రానికి ఏం చేశాడు అంటూ రాజకీయ పార్టీలు, వారి అనుంగు మీడియాలు చిరంజీవి మీద విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే రాజకీయ పార్టీల నేతలు అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసిన మంచి పనుల గురించి ఏకరువు పెడుతున్నారు. మొన్నటికి మొన్న టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెగా టూరిజం సర్క్యూట్ కోసం వెయ్యి కోట్ల నిధులు విడుదల చేశారని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తే, ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మరియు మంత్రి అవంతి శ్రీనివాస్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి చేపట్టిన చర్యల గురించి వేరే చర్చలో భాగంగా ప్రస్తావించారు. వివరాల్లోకి వెళితే..

టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, పుష్కరాల సమయంలో గోదావరి ప్రాంతాన్ని నిర్మించడం కోసం అఖండ గోదావరి ప్రాజెక్టు ఏర్పాటు చేశారని, అప్పుడు కేంద్ర మంత్రి గా ఉన్న చిరంజీవి గారు ఈ ప్రాజెక్టు కోసం 100 కోట్ల రూపాయలు పైగా కేటాయించడమే కాకుండా నిధులు విడుదల కూడా చేశారని, కడియం లంక లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారని, కానీ 2014 తర్వాత దాని గురించి కనుక్కుంటే, తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసిందని చెబుతూ, గోదావరి పరిసర ప్రాంతాలు ఎంతో సుందరమైనవని, వాటిని సరిగ్గా సంరక్షించుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలకు సమాధానమిస్తూ మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత మరియు మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా చిరంజీవి చేసిన పనులను ప్రస్తావించారు. గతంలో భీమిలి అభివృద్ధి కోసం చిరంజీవి గారు 50 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చి కేటాయిస్తే, తెలుగుదేశం ప్రభుత్వం ఆ 50 కోట్ల లో కనీసం పది కోట్ల ను కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుకో లేకపోయిందని విమర్శించారు. అదేవిధంగా చిరంజీవి రాజమండ్రి కోసం కేటాయించిన 100 కోట్ల లో కూడా కనీసం పది కోట్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు పెట్టలేక పోయిందని అవంతి శ్రీనివాస్ విమర్శించారు.

ఏది ఏమైనా మొన్న నిమ్మల రామానాయుడు, ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అవంతి శ్రీనివాస్ ల వ్యాఖ్యలు చూస్తుంటే, నిజం నిలకడ మీద అయినా తెలుస్తుందని, చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంత కాలం ఈ రాజకీయ పార్టీలు వారి అనుంగు మీడియాలు చిరంజీవి రాష్ట్రానికి ఏం చేశారు అంటూ ఎన్నో రకాలుగా ఎద్దేవా చేసినప్పటికీ, ఇప్పుడు అదే నేతలు చిరంజీవి చేసిన మంచి పనులను ఒకరి తర్వాత ఒకరు ప్రస్తావిస్తున్నారని అసెంబ్లీ ప్రసారాలు చూస్తున్న జనాలు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com