మ‌రొక‌రైతే ఈ సినిమాతో వంద కోట్లు మిగుల్చుకునేవాళ్లు: ప్ర‌భాస్‌

బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ తో సినిమా చేయ‌డానికి అగ్ర ద‌ర్శ‌కులు, నిర్మాణ సంస్థ‌లూ పోటీ ప‌డ‌తాయి. ప్ర‌భాస్ మార్కెట్‌, క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని చూస్తాయి. ప్ర‌భాస్ ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వ‌డానికి సైతం నిర్మాత‌లు సై అంటారు. కానీ ఇవేం పట్టించుకోకుండా – ఆ అవ‌కాశాన్ని త‌న స్నేహితులైన యూవీ క్రియేష‌న్స్ కోసం చేశాడు ప్ర‌భాస్‌. వాళ్లూ.. ప్ర‌భాస్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారు. బాహుబ‌లి 2కి మించిన బ‌డ్జెట్‌తో సాహోని రూపొందించారు. ప్ర‌చార చిత్రాల్లో స్టైలీష్ మేకింగ్‌, భారీద‌నం చూసి బాలీవుడ్ కూడా ఆశ్చ‌ర్య‌పోతోంది. తెలుగు సినిమా పేరు మ‌రోసారి జాతీయ స్థాయిలో విన‌ప‌డేలా యూవీ క్రియేష‌న్స్ చేసిన మాయ ఇది. అందుకే ప్ర‌భాస్ కూడా త‌న స్నేహితుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకున్నాడు. సాహో ప్రీ రిలీజ్ వేడుక‌లో ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ”మ‌రో నిర్మాత‌లైతే.. ఈ సినిమాతో వంద కోట్ల‌యినా మిగుల్చుకోవాల‌ని చూసేవాళ్లు. కానీ వంశీ, ప్ర‌మోద్‌లు ఆ లాభ‌మంతా వ‌దులుకుని భారీగా సినిమా తీశారు. ఇలాంటి స్నేహితులు అంద‌రికీ కావాల‌”న్నాడు ప్ర‌భాస్‌.

నిక్క‌రు వేసుకుని వ‌చ్చాడు

ఈ సంద‌ర్భంగా సుజిత్ గురించీ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశాడు ప్ర‌భాస్‌. సుజిత్‌ని మాస్ ప‌ల్స్ బాగా తెలుస‌ని, డైహార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్‌ని త‌నే రాశాడ‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌ద‌గ్గ‌ర‌కు మొద‌టిసారి నిక్క‌రు వేసుకుని వ‌చ్చాడ‌ని, ఇర‌వై రెండేళ్ల వ‌య‌సులో ర‌న్ రాజా ర‌న్ సినిమా తీశాడ‌ని, ఈ క‌థ చెబుతున్న‌ప్పుడు మాత్రం న‌ల‌భై ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తిలా క‌నిపించాడ‌ని చ‌మ‌త్క‌రించాడు. ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా? లేదా? అనే అనుమానాలున్నా, ఏ ఒక్క‌రోజూ… టెన్ష‌న్ ప‌డ‌కుండా సినిమాని తీశాడ‌ని, త‌ను అంత‌ర్జాతీయ ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని అనిపించింద‌ని చెప్పుకొచ్చాడు. శ్ర‌ద్దాక‌పూర్ యాక్ష‌న్ సీన్లు బాగా చేసింద‌ని, త‌ను న‌టించ‌డం ఈ సినిమా అదృష్ట‌మ‌న్నాడు ప్ర‌భాస్‌. యేడాదికి రెండు సినిమాలు చేస్తాన‌ని ఫ్యాన్స్‌కి ఇది వ‌ర‌కే ప్ర‌భాస్ మాట ఇచ్చాడు. కానీ అది కుద‌ర‌డం లేదు. ఈసారి మ‌ళ్లీ ఆ మాటే గుర్తు చేశాడు. ”సాహో లాంటి సినిమాలు చేయ‌డం వ‌ల్ల రెండు సినిమాలు తీయ‌డం కుద‌ర‌డం లేదు. ఈసారి చెప్ప‌కుండానే రెండు సినిమాలు తీస్తా” అని ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com