‘సాహో’ ప్రీరిలీజ్ ఈవెంట్… సూప‌ర్ స‌క్సెస్‌

బ‌హిరంగ వేడుక‌లు నిర్వ‌హించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. సినిమా ఫంక్ష‌న్ అయితే అది మ‌రింత క‌ష్టం. అభిమానుల్ని అదుపులో ఉంచ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. అందుకే ఓపెన్ గ్రౌండ్ లో ఈవెంట్లు నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు భ‌య‌ప‌డుతుంటారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, ఏదో ఓ అప‌శృతి జ‌రుగుతూనే ఉంటుంది. అయితే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాహో ప్రీ రిలీజ్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిపోయింది. సినిమా మాటెలా ఉన్నా.. ఫంక్ష‌న్ మాత్రం గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది.

న‌గ‌ర శివార్లలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక నిర్వ‌హించాల‌ని చిత్ర‌బృందం భావించింది. బాహుబ‌లి ప్రీ రిలీజ్ వేడుక కూడా ఇక్క‌డే జ‌రిగింది. కాబ‌ట్టి సెంటిమెంట్ ప‌రంగా రామోజీ ఫిల్మ్‌సిటీ ప్ర‌భాస్‌కి అచ్చొచ్చిన‌ట్టైంది. పైగా ఓపెన్ గ్రౌండ్ కాబ‌ట్టి, ఎంత‌మంది అభిమానులు వ‌చ్చినా ఇబ్బంది ఉండ‌దు. ఈ కార్య‌క్ర‌మానికి క‌నీసం 30 నుంచి 50 వేల‌మంది అభిమానులు వ‌స్తార‌ని చిత్ర‌బృందం ముందుగానే ఊహించింది. కానీ జ‌న సందోహం చూస్తే అందుకు రెట్టింపు అభిమానులు వ‌చ్చారేమో అనిపించింది. ఓ సినిమా వేడుక‌కు ఈ స్థాయిలో జ‌నం రావ‌డం… బ‌హుశా చాలా కాలం త‌ర‌వాత ఇదే తొలిసారేమో..?

అత్య‌ధిక బ‌డ్జెట్‌లో రూపొందించిన యాక్ష‌న్ సినిమా ఇది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే జ‌రిగింది. వేదిక ఏర్పాటు చేసిన విధానం ఆక‌ట్టుకుంది. సాహో వ‌ర‌ల్డ్ పేరుతో ఈసినిమాలో ఉప‌యోగించిన ఆయుధాలు, వాహ‌నాలు, ట్యాంక‌ర్లు అన్నీ ప్ర‌దర్శ‌న‌కు ఉంచారు. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇదో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

సాధార‌ణంగా ఇంత క్రౌడ్ వ‌చ్చిన‌ప్పుడు చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అలాంటివేం జ‌ర‌క్కుండా పోలీసు యాజ‌మాన్యం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంది. దాంతో పాటు ప్ర‌భాస్ అభిమానులు ఎప్ప‌టిలా క్ర‌మ‌శిక్ష‌ణ పాటించి ఫంక్ష‌న్‌ని స‌జావుగా జ‌రిగేలా చూశారు. మొత్తానికి సాహో ఫంక్ష‌న్ సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com