పాన్ ఇండియాలో అతి పెద్ద సూపర్ స్టార్ ఎవరంటే ప్రభాస్ పేరే చెబుతారు. కానీ.. ఆ బిల్డప్ ప్రభాస్ ఎక్కడా చూపించడు. తన పనేదో కామ్ గా చేసుకొని వెళ్లిపోతాడు. తన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడడు. స్పీచులన్నీ రెండు, మూడు నిమిషాల్లో ముసిగిపోతాయి. తన స్పీచులు బోరింగ్ గా ఉంటాయని ప్రభాసే చెప్పుకొంటాడు. కానీ ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ బాగా మాట్లాడాడు. బాగా అంటే… కాస్త లెంగ్తీగా. తన మాటలతో మరోసారి అభిమానుల్ని ఆకట్టుకొన్నాడు.
ప్రభాస్ స్పీచులు ఎప్పుడూ హడావుడి లేకుండా, సింపుల్ గా ఉంటాయి. ‘మా సినిమా ఇరగదీస్తుంది’ అని ఎక్కడా చెప్పుకోడు. ఈసారీ అదే జరిగింది. ‘ఈ పండక్కి అన్ని సినిమాలూ బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అనడంలో ప్రభాస్ మిగిలిన సినిమాలకు ఇచ్చే గౌరవం అర్థం అవుతుంది. ముఖ్యంగా సీనియర్ హీరోల గురించి ప్రభాస్ చెప్పిన మాటలు తప్పకుండా ప్రస్తావించుకోవాలి. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ తోటి సినిమాలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
“నా స్పీచులు బోరింగ్ గా ఉంటాయి. ఏదో ఒక రోజు స్పీచు ఇరగదీస్తా..“ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు చూస్తే మరింత ముచ్చటేస్తుంది. మారుతి స్పీచ్ ఇస్తున్నప్పుడు కన్నీళ్ల పర్యంతం అయినప్పుడు ప్రభాస్ వేదిక మీదకు వెళ్లి ఓదార్చిన సీన్ ఇంకా బాగా అనిపించింది. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ మారుతి కన్నీటికి ప్రభాస్ భాష్యం ఇచ్చాడు. `ఇక్కడ ఏడిపించాడు కానీ.. సినిమా అంతా నవ్విస్తూనేఉన్నాడు` అంటూ మారుతికి కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి క్లైమాక్స్ బాగా నచ్చిందట. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ ప్రభాస్ మెచ్చుకోవడం ఈ స్పీచుకే హైలెట్.
మొత్తానికి ప్రభాస్ స్పీచులో మార్పు కనిపించింది. ప్రభాస్ ఇంత లెంగ్తీ స్పీచ్ ఇస్తాడని అభిమానులు కూడా ఊహించి ఉండరు. వాళ్లంతా ప్రభాస్ స్పీచ్ కి ఖుషీ అయిపోతున్నారు. బహుశా.. చాలా కాలం తరవాత అభిమానుల ముందుకు రావడం, సినిమాపై నమ్మకం పెరగడంతో.. ప్రభాస్ ఇలా ఓపెన్ అయి ఉంటాడు.
