ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకొంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ దే హావా. సినీ తారలు, సెలబ్రెటీలూ ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. నటుడు మోహన్ బాబు కూడా ఓ ట్వీట్ చేశారు. ప్రభాస్ కు శుభాకాంక్షలు చెబుతూనే, పెళ్లి చేసుకొని, డజను మంది పిల్లల్ని కని, కొత్త జీవితం ప్రారంభించు అంటూ… దీవెనలు అందజేశారు.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ అనే విషయంలో సందేహం లేదు. ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులే కాదు, యావత్ చిత్రసీమ ఎదురు చూస్తోంది. కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి గురించి కలలు కన్నారు. బాహుబలి అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. బాహుబలి పదేళ్ల పండగ పూర్తి చేసుకొని, రీ రిలీజ్కు సిద్ధం అవుతున్న ఈ తరుణంలోనూ ప్రభాస్ పెళ్లి కబురు వినిపించడం లేదు. కనీసం ఈ యేడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష. అదే… మోహన్ బాబు ట్వీట్ లోనూ బయటపడింది.
ప్రభాస్ – మోహన్ బాబు మధ్య మంచి అనుబంధం వుంది. `బుజ్జిగాడు` కోసం ఇద్దరూ కలిసి నటించారు. ‘కన్నప్ప’లో ప్రభాస్ అతిథి పాత్రలో దర్శనమిచ్చాడు. ఆ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకపోవడం విశేషం. ఇదంతా మోహన్ బాబుపై ఆయనకున్న అభిమానమే.
