ఈరోజుల్లో ఒక్క హిట్ట్ పడడం ఎంతో అమూల్యం. పైగా కొత్త హీరో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోకు హిట్లు పడడం చాలా కష్టం. కానీ ప్రదీప్ రంగనాథ్ మాత్రం వరుసగా రెండు హిట్లు కొట్టాడు. ‘లవ్ టుడే’తో కుర్రాళ్లని మెప్పించాడు. ‘డ్రాగన్’ తో మళ్లీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ‘డ్యూడ్’తో వస్తున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ దీపావళికి (17న) విడుదల అవుతోంది. నిజానికి ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ తప్ప స్టార్లు ఎవరూ లేరు. హీరోయిన్ మమిత బైజుకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. వీళ్లిద్దరూ మినహాయిస్తే మిగిలిన కాస్టింగ్ గురించి పెద్దగా తెలీదు. అయినా సరే.. ఈ సినిమా క్రేజ్ సంపాదించుకొంది. దానికి కారణం మైత్రీ మూవీస్ మాత్రం కాదు. కేవలం… ప్రదీప్ పై ఉన్న నమ్మకం.
యూత్ లో ప్రదీప్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తను తెలుగు కుర్రాడు కాదు. అయినా సరే.. రెండు సినిమాలతో తెలుగువాడు అయిపోయాడు. అందుకే ‘డ్యూడ్’ కోసం అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్టయితే.. ప్రదీప్‌కి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. తొలి అడుగుల్లోనే హ్యాట్రిక్ పలకరించడం మామూలు విషయం కాదు. అదే జరిగితే… ప్రదీప్ స్టార్ హీరో అయిపోయినట్టే. తమిళంలో ఒకప్పుడు ధనుష్‌కి ఎలాంటి క్రేజ్ ఉండేదో.. ఇప్పుడు ప్రదీప్ కి అంతటి క్రేజ్ వుంది. యూత్ కి నచ్చే కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం, పక్కింటి అబ్బాయిలా కనిపించడం, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం.. ఇవన్నీ ప్రేక్షకులకు దగ్గర చేసేశాయి. తెలుగులో ఒకరిద్దరు దర్శకుడు ప్రదీప్‌కి కథలు చెప్పారు. కానీ వర్కవుట్ కాలేదు. ఒకవేళ డ్యూడ్ హిట్ అయితే… తెలుగు నుంచి ప్రదీప్ కు మరిన్ని కథలు వెళతాయి. ‘ఎల్ఐసీ’ అనే మరో సినిమా పూర్తి చేసేశాడు ప్రదీప్. ఇది కూడా యూత్ ఫుల్ కథే. ఈ యేడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీని తరవాత ఓ థ్రిల్లర్ చేయాలని వుందట. అయితే అది కూడా యువతరానికి నచ్చేలా ఉంటుందని చెబుతున్నాడు ప్రదీప్.