ప్రజావేదిక శిధిలాల వేలం..!

గుంటూరు జిల్లాలో కృష్ణానది కరకట్ట మీదుగా.. సచివాలయానికో.. మరో చోటకో వెళ్తూ ఉంటే… కొత్త వాళ్లు ఎవరైనా.. రోడ్డు పై నుంచే ఆసక్తిగా చూసే దృశ్యం ప్రజావేదిక. అక్కడ ప్రజావేదిక లేదు. కేవలం శిధిలాలే ఉన్నాయి. ప్రజావేదికను కూల్చివేసిన తర్వాత అక్కడ శిధిలాలను తొలగించలేదు. అవి అంతే.. ఓ శిధిల జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఏపీలో విధ్వంస పాలన సాగుతోందని.. దానికి ప్రజావేదికనే సాక్ష్యం అని.. టీడీపీ సందర్భం వచ్చినప్పుడల్లా.. వాటిని చూపిస్తోంది. కూల్చివేసి.. శిధిలాలను కూడా తొలగించడం చేతకాలేదని.. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావేదిక శిధిలాలను వేలం వేయాలని నిర్ణయించుకుంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… కరకట్టపై ఆయన ఉండే ఇంటి పక్కన స్థలంలో అన్ని రకాల సమావేశాలకు ఉపయోగపడేలా… ఓ కట్టడాన్ని నిర్మించారు. దానికి ప్రజావేదిక అని పేరు పెట్టారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లతో పాటు.. టీడీపీ వ్యవహారాలు కూడా అక్కడ్నుంచే నిర్వహించేవారు. జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత.. తొలి కలెక్టర్ల సమావేశాన్ని అక్కడే ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత .. దాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. దాని ప్రకారం.. ఆ రోజు రాత్రి నుంచే కూల్చివేత పనులు ప్రారంభించారు. పనికొస్తే వస్తువులన్నింటినీ సీఆర్డీఏ అధికారులు తీసుకెళ్లారు. కూల్చివేతకే కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ.. శిధిలాలను తొలగించాడనికి ఇవ్వలేదు. దాంతో స్క్రాప్ అక్కడే ఉండిపోయింది.

ఈ స్కాప్‌ను వేలం ద్వారా దక్కించుకోవాలని.. అధికారులు కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు. మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ప్రజావేదిక ప్రీ ఫ్యాబ్రికెటేడ్ విధానంలో నిర్మించిన కట్టడం. మామూలుగా అయితే.. కాస్త ఓపికతో.. మొత్తం ఎక్కడివక్కడ ఊడదీసి తీసుకెళ్లి వెరే చోట వాడుకోవచ్చు. కానీ ప్రభుత్వం కూల్చివేతకు ఆదేశివ్వడంతో.. ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు వాటిని స్క్రాప్ కింద అమ్మేస్తున్నారు. నెల రోజుల తర్వాత ప్రజావేదిక ఆనవాళ్లు కూడా అక్కడ ఉండకపోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com