గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో అప్ర‌మ‌త్త‌మైన కాంగ్రెస్‌..!

కొన్ని గంటల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర అత్యంత కీల‌కం కాబోతోంద‌న్న‌ది తెలిసిందే. అందుకే, ఈ విష‌యంలోనూ టి. కాంగ్రెస్ ముందుజాగ్ర‌త్తలు తీసుకుంటోంది! ప్ర‌జా కూట‌మికి చెందిన నేతలంతా గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ‌న్ ను క‌లుసుకున్నారు. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, అజారుద్దీన్, మ‌ధు యాష్కీతోపాటు ఎల్‌. ర‌మ‌ణ‌, కోదండ‌రామ్‌, చాడా వెంక‌ట రెడ్డి, మందకృష్ణ మాదిగ త‌దిత‌ర ప్ర‌ముఖ నేత‌లంతా గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన‌వారిలో ఉన్నారు. ప్ర‌జా కూట‌మిలోని భాగ‌స్వామ్య ప‌క్షాల‌న్నింటినీ ఒక పార్టీగా ప‌రిగ‌ణించాల‌ని కోరారు.

అనంత‌రం, ఉత్త‌మ్ మీడియాతో మాట్లాడుతూ… మంగ‌ళ‌వారం ఎన్నిక‌ల ఫలితాలు వెలువడుతున్న త‌రుణంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశామ‌న్నారు. ఎన్నిక‌ల సంఘానికి ప్ర‌జా కూట‌మి ఇచ్చిన ప‌త్రాలు, పార్టీల‌న్నీ ఉమ్మ‌డిగా విడుద‌ల చేసిన మేనిఫెస్టో కాపీ గ‌వ‌ర్న‌ర్ కు ఇచ్చామ‌న్నారు. కొన్ని పార్టీ చేస్తున్న చ‌ర్య‌ల్ని గ‌మ‌నించి, తాము అప్ర‌మ‌త్తం అవుతున్నామ‌న్నారు. కూట‌మి త‌ర‌ఫున గెలిచే అభ్య‌ర్థుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కూడా గ‌వ‌ర్న‌ర్ ను కోరిన‌ట్టు ఉత్త‌మ్ చెప్పారు.

గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో కాంగ్రెస్ అప్ర‌మ‌త్తం కావ‌డానికి కార‌ణం లేక‌పోలేదు! ఈ మ‌ధ్య క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో అక్కడ గ‌వ‌ర్న‌ర్ స్పంద‌నే కీల‌క‌మైన సంగ‌తి తెలిసిందే. అత్య‌ధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ పిల‌వాల్సి ఉంటుంద‌ని భాజ‌పా నేత‌లు కొంత హ‌డావుడి చేశారు. నిజానికి, ఇదే అంశ‌మై గ‌తంలో సుప్రీం కోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలే ఇచ్చింది. ఏ పార్టీకీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాక‌పోతే… ఎన్నిక‌ల ముందు వివిధ పార్టీల‌తో ఏర్ప‌డ్డ కూట‌మికి అవ‌కాశం ఇవ్వాలి. అలాంటి కూట‌మి లేన‌ప్పుడు… ఎన్నిక‌ల త‌రువాత ఏర్ప‌డే కూట‌మికీ అవ‌కాశం ఇవ్వొచ్చు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ టెన్ష‌న్ ఏంటంటే… హంగ్ దిశ‌గానే ఫ‌లితాలు ఉంటానే అంచ‌నాలున్నాయి కాబ‌ట్టి, తెరాస కూడా ఇత‌ర ప‌క్షాల‌ను ఆక‌ర్షించే అవ‌కాశం ఉంద‌నేది! వాస్త‌వానికి భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు కొన్ని ఎక్కువ సీట్ల‌ను కాంగ్రెస్ ఇచ్చి ఉన్నా ఈ టెన్ష‌న్ ఉండేది కాద‌ని చెప్పొచ్చు. ఏ పార్టీకీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ ద‌క్క‌ని ప‌రిస్థితి ఉంటే… ప్ర‌భుత్వ ఏర్పాటు చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్ పిలుపు ఏమాత్రం ఆల‌స్య‌మైనా, స‌మీక‌ర‌ణ‌లు మారిపోవ‌డానికి క‌చ్చితంగా ఆస్కారం ఉంది. కాబ‌ట్టి, కాంగ్రెస్ కు అన్ని వైపుల నుంచీ కొంత టెన్ష‌న్ ఉంద‌నే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com