మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా సాగుతోంది. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యమధ్యలో మహేష్ చిన్న చిన్న బ్రేక్ తీసుకొని షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ తో పాటుగా ప్రియాంకా చోప్రా, ఫృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వీళ్లకు సంబంధించిన లుక్స్ కూడా బయటకు వచ్చేశాయి. ఈ ముగ్గురు తప్ప ఈ చిత్రంలో ఇంకెవరు నటిస్తున్నారన్న విషయంలో చిత్రబృందం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ సినిమాలో మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్. ఆయన హనుమంతుడిగా కనిపించే అవకాశాలు ఉన్నాయట.
ఇప్పుడు మరో పాత్ర కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని తీసుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారని సమాచారం. వారణాసి సెట్లో ప్రకాష్ రాజ్ అడుగుపెట్టారని, ఆయనపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వరకు ఈ పాత్ర కోసం ఒకరిద్దరు నటులపై టెస్ట్ షూట్ చేశారు రాజమౌళి. కానీ ఆయన సంతృప్తి చెందలేదు. చివరికి ఈ పాత్ర ప్రకాష్ రాజ్ ని వరించింది. ఈ చిత్రంలో మహేష్ రాముడిగా, రుద్రుడిగా కనిపించబోతున్నట్టు తెలిసిందే. ఇవి కాకుండా మరో మూడు పాత్రలు కూడా ఉంటాయట. అవేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.