తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను వదిలి పెట్టేదిలేదని ప్రకటించారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న కాంక్లేవ్లోనూ తాజాగా రేవంత్ రెడ్డికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. గత ఎన్నికలకు ముందు తనను గెలిపించాలని రేవంత్ రెడ్డి తనకు విజ్ఞప్తి చేశారన్నారు. కానీ ఆయన బీహార్ ప్రజల్ని అవమాన పరుస్తున్నారని.. కూలీలుగా బీహార్ ప్రజలు పనికి వస్తారని ఎద్దేవా చేస్తున్నారని ఆయనను వదిలిపెట్టేది లేదంటున్నారు.
స్ట్రాటజిస్టు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ అనే పార్టీ పెట్టుకుని ఎన్నికల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమిని ఆయన గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ పనైపోయిందని ఆయన నమ్ముతున్నారు. ఇటీవల రాహుల్ చేపట్టిన ఓట్ చోరీ యాత్రలో పాల్గొనేందుకు రేవంత్ వెళ్లారు. ఇదే అవకాశం అనుకుని గతంలో రేవంత్ మాట్లాడిన మాటలను గుర్తు చేసి..బీహారీలను అవమానించే వారిని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
స్ట్రాటజిస్టుగా.. ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసే అంశమేదో ఆయనకు బాగా తెలుసు. అందుకే ప్రశాంత్ కిషోర్..బీహారీల ఆత్మగౌరవం అంశాన్ని ఎత్తుకుంటున్నారు. దానికి రేవంత్ రెడ్డి.. బీహార్ తో సంబంధం లేకుండా.. కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు మాట్లాడిన మాటల్ని ఆయుధంగా తీసుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా అవే చెబుతున్నారు. కొసమెరుపేమిటంటే..బీజేపీ నేతలు కూడా రేవంత్ మాటల్ని బీహార్ లో కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.