ఎక్కడ బీహార్.. ఎక్కడ తెలంగాణ. రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధం లేదు. అయినా సరే బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న స్ట్రాటజిస్ట్ పొలిటీషియన్ ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ సీఎంను టార్గెట్ చేసుకుంటున్నారు. ఆయనను ఎవరూ కాపాడలేరని హెచ్చరిస్తున్నారు. తాజాగా మరో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్లీ ఇంకోసారి గెలవడని స్పష్టం చేశారు. బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అయినప్పుడు, ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగాడని ఆయన ప్రశ్నించారు.
ప్రశాంత్ కిషోర్ సాయాన్ని రేవంత్ రెడ్డి అడిగి ఉండవచ్చు.. అంటే ఆయనపై నమ్మకం ఉన్నట్లే. పీకే సాయం చేశాడో లేదో చెప్పలేదు. కానీ ఎందుకు వ్యతిరేకత పెంచుకోవాల్సి వచ్చిందన్నది సస్పెన్స్ గా మారింది. రేవంత్ ను టార్గెట్ చేయడానికి బీహారీల డీఎన్ఏ గురించి చేసిన వ్యాఖ్యలే కారణం కాదని..ఇంకేదో ఉందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటో తెలియాల్సి ఉంది. పీకే పట్టుదల చూస్తూంటే.. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ను ఓడించడానికి బీజేపీకో..బీఆర్ఎస్కో ఉచితంగా పని చేసినా ఆశ్చర్యం ఉండదని సెటైర్లు వేస్తున్నారు.