రాజకీయ నేతగా మారిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవిష్యత్ పై పునరాలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రియాంకా గాంధీతో దాదాపుగా నాలుగు గంటల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లుగా ఢిల్లీ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. బీహార్ లో ఎన్నికల ఓటమి గురించి పూర్తి స్థాయి ఎనాలసిస్ ను ఆమెకు సమర్పించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు ఆయన ఆసక్తి చూపినట్లుగా కూడా చెబుతున్నారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమయింది. కానీ ఆయన మెరుగైన ఫలితాలు రావాలంటే.. పార్టీ తన గుప్పిట ఉండాలన్నట్లుగా వ్యవహరించారు. అప్పట్లో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఎంత కీలకంగా ఉండేవారో.. తనకూ అలాంటి పవర్ కావాలని కోరుకున్నారు. అయితే రాహుల్ గాంధీకి.. ప్రశాంత్ కిషోర్ మీద సదభిప్రాయం లేదు. ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వడానికి వెనుకడుగు వేశారు. దాంతో ప్రశాంత్ కిషోర్ చిన్నబుచ్చుకుని తన పార్టీ తాను పెట్టుకుని రాజకీయం చేసుకున్నరాు.
ఇప్పుడు మళ్లీ ఆయనను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ కూ ఎన్నికల రాజకీయాల పట్ల ఓ స్పష్టత వచ్చిందని.. జాతీయ పార్టీలో చేరడమో..లేకపోతే తన పార్టీని తీసుకెళ్లి విలీనం చేయడమో ఏదో ఒకటి చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశం పీకే కానీ.. కాంగ్రెస్ కానీ ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు.
